Jump to content

ప్రపంచ చరిత్ర/వ్రాత సంప్రదాయముల భారము

వికీసోర్స్ నుండి

సంవత్సరములనుండి అది వాసయోగ్యముకాని గొడ్డు దేశమైనది. ఎడారితో సమానముగా నున్నది. ఆ నాటి గొప్పపట్టణములు కొన్ని నేటికి నిలిచి యున్నవి సమర్కండ్, బొఖారా అనునవి రెండు పట్టణములు. వాని పేళ్లు విన్నంతనే మనకు ప్రాతవిషయములెన్నో స్మృతిపథమునకు తగులును. కాని నేటి పట్టణములు వెనుకటి పట్టణముల ఛాయలు మాత్రమే. ,

మరల నేను రాబోవు విషయములను ముందు చెప్పుచున్నాను. మనము ప్రసంగించుకొనుచున్న కాలములో సమర్కండ్, బొఖారాలు లేవు. ఇదంతయు ముందు రాబోపు విషయము. భావికాల మను తెర దానిని మరుగు చేసినది. మధ్య ఆసియా గొప్పతనమును, పతనమును ముందుకాలపు విషయములు.


9

ప్రాతసంప్రదాయముల భారము

జనవరి 14, 1931

నేను చెరసాలలో క్రొత్త అలవాట్లను చేసికొన్నాను. అందొక్కటి అరుణోదయము కాకముందేలేచుట. కడచిన వేసగినుండియు ఈ అలవాటు చేసికొన్నాను. ఉషఃకాలమువచ్చి క్రమక్రమముగా నక్షత్రముల నార్పివేయుట చూడ నాకు సరదాగా నుండును. ఉషఃకాలమునకు ముందుండు వెన్నెల నెప్పుడైన చూచితివా? రాత్రి మెల్లగా మారి పగలగుట చూచితివా? వెన్నెలకును, ఉషఃకాలమునకును జరుగు పోరాటము నెన్ని పర్యాయములో చూచితిని. చివరకు విజయమెప్పుడును ఉషఃకాలముదే. వింతగానుండు ఆ సగము వెలుగులో అది వెన్నెలయో, లేక రానున్న పగటివెలుగో చెప్పుట కొంత సేపటివరకు కష్టము. పిమ్మట, హఠాత్తుగా సందేహము తొలగును, అది పగలే. వెలవెలబారు చంద్రుడు పోరాటమున ఓడిపోయి వెడలిపోవును. నా అలవాటు చొప్పున నేడు నక్షత్రము లుండగనే నేను లేచితిని. తెల్లవారుటకు ముందు గాలిలో ఏదో ఉండును. దానినిబట్టి తెల్లవారుచున్నదని మనము గ్రహింపవచ్చును. నేను కూర్చుండి చదువుకొను చుండగా, దూరమునందుండి కంఠధ్వనులు, కోలాహలము అంతకంత కతిశయించుచు వినిపించి ఉదయకాల ప్రశాంతిని చెడగొట్టినవి. అది సంక్రాంతి దినమని జ్ఞాపకము చేసికొంటిని. మాఘమేశోత్సవమున మొదటిదినమది. గొప్పదినము. త్రివేణీసంగమస్థలమున ప్రాతఃస్నానము చేయుటకు యాత్రికులు వేలకువేలు నడిచి వెళ్లుచున్నారు. గంగాయమునలును, (అంతర్వాహినిగాన) అగోచరమగు సరస్వతియును కలిసి త్రివేణీ సంగమ మేర్పడుచున్నది. నడుచుచు వారొకప్పుడు పాటలు పాడుచుండిరి; ఒకప్పుడు “గంగా మాయికి జై " అని జయధ్వనులు చేయుచుండిరి. నాయిని చెరసాలగోడలు దాటి వారి కంఠధ్వనులు నా చెవుల బడెను. బహుళ సంఖ్యాకుల నీ నదివద్దకు లాగుకు వచ్చినట్టియు, తాత్కాలికముగా వారు తమ దరిద్రమును, దుఃఖమును విస్మరించునట్లు చేసినట్టియు భక్తిప్రభావ మెట్టిదోగదా యనుకొంటిని. సంవత్సరము సంవత్సరము త్రివేణిలో స్నానము చేయుటకై ఎన్నివందల, లేదా ఎన్ని వేల సంవత్సరములనుండి యాత్రికులు వెళ్లుచున్నారోగదా యనుకొంటిని. మనుష్యులురావచ్చును. మనుష్యులు పోవచ్చును, రాజ్యములు, సామ్రాజ్యములు కొంతకాల మధికారము చలాయించవచ్చును. తరువాత భూత కాలములో అంతరించిపోవచ్చును. కాని ప్రాచీన సంప్రదాయము ఒకే విధముగా సాగిపోవుచుండును, తరతరములవారు దానిని శిరసా వహించుచుందురు. సంప్రదాయ సిద్ధమగు ఆచారములో మంచి చాలా ఉన్నది. ఒక్కొక్కప్పుడది. దుర్భరభార మగును. ముందు సాగి పోవుటకు మన కది యాటంకములు కల్పించును.

అస్పష్టము, దూరము అగు భూతకాలముతో సంబంధము కలుపు అవిచ్ఛిన్నమగు ఈ గొలుసును తలుచుకొన్నాను. 1300 సంవత్సరముల క్రితము వ్రాసిన మేళముల వృత్తాంతములు చదువుకొన్నాను... అప్పుడు కూడ మేళములు ప్రాచీన సంప్రదాయమేసుమా - రమణీయముగా నుండును. కాని మనము ముందుకు పోదలచినప్పుడీ గొలుసు మనల నంటుకొనియుండును. సంప్రదాయబద్ధులమైన మనము చేయి కాలు కదుప లేము. భూతకాలముతో సంబంధము మనము నిలుపుకొనవలసినదే కాని మన పురోభివృద్ధికి ఆటంకముగానుండు సంప్రదాయమును మాత్రము విచ్చిన్నము చేయకతప్పదు.

2500, 3000 సంవత్సరములకు పూర్వము ప్రపంచమెట్లుండెనో తెలిసికొనుటకు వెనుకటి మూడుత్తరములలోను ప్రయత్నించితిమి. నేను తేదీలను, సంవత్సరములను ఉదహరించలేదు. తేదీలు, సంవత్సరములు అన్న నా కిష్టములేదు. నీవుకూడ ఆ గొడవ పెట్టుకోకు. ప్రాచీన కాలమున నే సంవత్సరమున నేమి సంభవించెనో సరిగా తెలిసికొనుట కష్టము, పోనుపోను కొన్ని తేదీలు జ్ఞాపకముంచుకొనుట అవసరమగును. మనస్సులలో సరియైన క్రమమున జరిగిన సంగతుల నుంచుకొనుట కాతేదీ పనికివచ్చును. ప్రస్తుతము మనము ప్రాచీన ప్రపంచస్వరూపమును తెలిసికొన ప్రయత్నించుచున్నాము.

గ్రీసు, మధ్యధరాప్రాంతము, ఈజిప్టు, ఆసియామైనరు, పర్షియా లనుగురించి కొంత తెలిసికొంటిమి. ఇప్పుడు మనము మన దేశమునకు తిరిగివత్తము. హిందూదేశముయొక్క తోలుతటి చరిత్రను గురించి తెలిసికొనుట కొక పెద్ద యిబ్బంది ఉన్నది. తొలుతటి ఆర్యులు - వీరినే ఇండో-ఆర్యులు అందురు. - చరిత్ర లేమియు వ్రాయలేదు. వారు ఎన్నివిధములుగానో ఎంతో గొప్పవారని వెనుకట ఉత్తరములలో మనము చూచియుంటిమి. వారు ప్రచురించిన గ్రంథములు, వేదములు, ఉపనిషత్తులు, రామాయణము, మహాభారతము ఇంకను ఇతర గ్రంథములు మహామహులు రచించినవై యుండవలెను. ప్రాచీనచరిత్రను తెలిసికొనుట గ్రంథములును, ఇతర సామగ్రియు సహాయకారు లగు చున్నవి. మన పూర్వుల ఆచార వ్యవహారములు, వారి ఊహాపోహలు, వారి జీవనపద్దతిపై గ్రంథాదులనుండి మనము గ్రహించవచ్చును. కాని అవి నిర్దుష్టచరిత్రకాదు. తరువాత కాలమునాటికి సంబంధించిన యథార్థచరిత్ర ఒకటి సంస్కృతములో నున్నది. అది కాశ్మీరదేశమును గురించి. ఈ గ్రంథముపేరు రాజతరంగిణి. గ్రంథకర్త కల్హణుడు. కాశ్మీరరాజుల చరిత్ర ఇందు వర్ణితము. విన్నావో లేదో, [1]రంజిత్ మామ ఈ గొప్ప కాశ్మీర చరిత్రను సంస్కృతమునుండి ఇప్పుడే తర్జుమా చేయుచున్నాడు. సుమారు సగముగ్రంథ మప్పుడే పూర్తిఆయనది. అది చాల పెద్దపుస్తకము. తర్జుమా పూర్తిఅయినపిమ్మట మన మందరము తప్పక దాని నుత్సాహముతో చదువుదము. దురదృష్ట వశాత్తు మనకు చాలినంత సంస్కృతజ్ఞానము లేకపోవుటవల్ల సంస్కృత గ్రంథము చదువలేము. అది చక్కని గ్రంథమని మాత్రమేకాదు దానిని మనము చదువుట, అది గతకాలమునుగూర్చి అనేక విషయములు చెప్పును. ముఖ్యముగా కాశ్మీరమునుగురించి, నీ వెరుగుదువా. కాశ్మీరము మన పూర్వుల జన్మభూమిసుమా !

ఆర్యులు ఇండియాలో కాలు పెట్టుసరికి ఇండియా నాగరికతగల దేశముగానే యుండెను. వాయవ్యదిశనున్న మొహంజొదారొవద్ద దొరికిన శిథిలములనుబట్టి చూచిన, ఆర్యులు రాకముందే ఇక్కడ నాగరికత గొప్పగా నుండెనని ధ్రువపడుచున్నది. కాని దీనినిగురించి మన కింకను ఎక్కువగా తెలియదు. పురాతన వస్తు శాస్త్రజ్ఞులు — అనగా ప్రాతశిథిలములను పరీక్ష చేయువారు - అక్కడ దొరుకు పదార్థముల నన్నింటిని త్రవ్వి బయటకు తీసినపిమ్మట, కొద్ది సంవత్సరములలో మన కింకను ఎక్కువ విషయములు తెలియవచ్చును.

ఈ విషయ మిట్లుండనిచ్చినను, ఆకాలమున దక్షిణ హిందూదేశమున-బహుశా ఉత్తర హిందూస్థానమునకూడా- ద్రావిడులు గొప్ప నాగరికత కలిగియుండిరి. వారి భాషలు ఆర్యుల సంస్కృతమునుండి పుట్టినవికావు. అవి పురాతనభాషలు. వానికి చక్కని సారస్వతములు కలవు. తమిళము, తెలుగు, మళయాళము, కన్నడము - ఇవి యాభాషలు. ఈ భాషలన్నియు దక్షిణఇండియాలో నేడుకూడ వర్దమానమగుచున్నవి. నీకు తెలియు ననుకొందును - జాతీయ మహాసభ (కాంగ్రెసు), బ్రిటిషు దొరతనమువలెగాక, ఇండియాను భాషలనుబట్టి రాష్ట్రములుగా విభజించినది. ఇది నేడున్న పద్దతికన్న ఉత్తమపద్ధతి. ఎందుకనగా సాధారణముగా సమాన ఆచార వ్యవహారములు గలిగి, ఒకే భాష మాటాడు ఒకేమాదిరి ప్రజలు ఒక రాష్ట్రములో నుందురు. దక్షిణముననున్న కాంగ్రెసు రాష్ట్రము లేవనగా - ఆంధ్రదేశము, లేదా ఆంధ్ర రాష్ట్రము : ఇది చెన్నపట్టణమున కుత్తరమున నున్నది. ఇచ్చట మాటాలు భాష తెలుగుభాష, తమిళనాడు, లేదా తమిళరాష్ట్రము : ఇచ్చట ఆరవము మాటాడుదురు. కర్ణాటకము : ఇది బొంబాయికి దక్షిణముగా నున్నది. ఇచ్చట మాటాడు భాష కన్నడము, లేదా కర్ణాటకము. కేళము : ఇది కొంచే మెచ్చుతక్కువగా మలబారుదేశము. ఇచ్చటి భాష మళయాళము. ముందుముందు భాషా ప్రయుక్త రాష్ట్రములు రాష్ట్రభాషల యభివృద్ధికొర కెక్కువగా పాటుపడగలవనుటకు సందేహములేదు.

ఇండియాలోని భాషలనుగురించి మరికొంతచెప్పెదను, యూరోపులోను, ఇంకను ఇతర దేశములలోను కొందరు ఇండియాలో వందలకొలది భాష లున్నవని భ్రమపడుదురు. ఇది అసందర్భము. ఇట్లు చెప్పెడువాడు తన యజ్ఞానమును ప్రకటించుకొనుచున్నాడు. ఇండియా వంటి పెద్దదేశములో అనేక ప్రాంతీయ భాషలున్నవి-ఒకే భాష వేర్వేరు ప్రాంతములందు భిన్నరూపము ధరించుచుండును. కొండజాతులవా రెందరో యున్నారు. ప్రత్యేక భాషలుగల సంఘములు కొన్ని యున్నవి. మొత్తము ఇండియానుగురించి మాటాడుచున్నప్పు డివి యన్నియు అప్రధానవిషయములు. జనాభాకొరకే వాని ప్రాధాన్యము, ఇండియాలోనున్న అసలు భాషలు — ఈ విషయ మిదివరలో నీకు వ్రాసితినేమో - రెండు కుటుంబములకు చెందియున్నవి. ఒకటి ద్రావిడ కుటుంబము. దీనిని గురించి పైని చెప్పియున్నాను. వెండవది ఇండో ఆర్యను కుటుంబయి. ప్రధానమగు ఇండో ఆర్యనుభాష ఇండియాలో సంస్కృతమే. ఇండియాలోని ఇండో ఆర్యనుభాష లన్నిటికిని సంస్కతము మాతృక. అవి హిందీ, బెంగాలి, గుజరాతీ, మరాటీ భాషలు, ఇవికాక అస్సాంలో అస్సామీసు భాషయు, ఒరిస్సాలో (ఉత్కళము) ఓడ్ర భాషయు వాడుకలోనున్నవి. హిందీభాష భిన్నస్వరూపమే ఉర్దు. హించూస్తానీ అనుమాట హిందీకిని, ఉర్దుకునుకూడ చెల్లును. కాన ఇండియా ప్రధానభాషలు సరిగా పది. హిందూస్తానీ, బెంగాలీ, గుజరాతీ, మరాటీ, తమిళము, తెలుగు, కన్నడము, మళయాళము, ఓడ్రము, అస్సామీను. ఈ భాషలో మన మాతృభాషయైన హిందూస్తానీ ఉత్తర హిందూస్థానమందంతటను వాడుకలో నున్నది - పంజాబులో సంయుక్త రాష్ట్రములలో, బీహారులో. మధ్యరాష్ట్రములలో, రాజపుటానాలో, ఢిల్లీలో, మధ్య ఇండియాలో. ఇది పెద్ద భూభాగము. ఇంచు 15 కోట్ల మంది నివసించుచున్నారు. కొద్ది తేడాలతో 15 కోట్ల మంది అప్పుడే హించూస్తానీ మాటాడుచున్నారుగదా. ఇంతేకాదు. హిందూస్తానీ భాష ఇండియా అన్ని ప్రాంతములందును అర్థమగుచున్నమాట నీకు బాగుగా తెలియును. అది ఇండియా కంతకును సామాన్య భాష కాగలదు. ఇందువల్ల, పైన నేను చెప్పిన ప్రధానభాషలు అంతరించిపోవలె నని అర్థముకాదు. అవి రాష్ట్రభాషలుగా ఉండవలసినదే. ఎందువల్ల ననగా. వాని సారస్వతములు చక్కనివి. సర్వతోముఖముగా అభివృద్ధిగాంచిన భాషను, అభాష మాటాడు ప్రజలకు కాదని తీసివేయుట కెవ్వరును. ఎప్పుడును ప్రయత్నించరాదు. స్వభాషద్వారానే ప్రజలు వృద్ధిగాంతురు. వారి పిల్లలు విద్య నభ్యసింతురు. నేడు ఇండియాలో సర్వమును తల క్రిందులుగా నున్నది. మనలో మన మెక్కువగా ఇంగ్లీషుభాషను వాడుకొనుచున్నాము. నేను నీకు ఇంగ్లీషులో జాబులువ్రాయుట హస్యాస్పదము. కాని నేను వ్రాయుచునేయున్నాను. ఈ అలవాటు త్వరలో మనము తప్పించుకొందుమని ఆసించుచున్నాను.


10

ప్రాచీన హిందూస్థానమున గ్రామ పంచాయతులు

జనవరి 15, 1931

ప్రాచీనచరిత్ర పరిశీలనమున మనము ముందుకు సాగిపోవుట ఎట్లు: నేనెప్పుడును బాటవదలి ప్రక్క పుంతలకు పోవుచున్నాను. క్రిందటి జాబులో విషయము నెత్తుకొనబోవుచు ఇండియాలోని భాషలను గురించి చెప్పితిని,

ప్రాచీన హిందూస్థానమునకు మనము దిరిగిపోదము . ఇప్పుడు ఆఫ్‌ఘనిస్థాన మనబడు దేశము అప్పుడును, తరువాత ఎంతో కాలమువరకును హిందూదేశ భాగమైయుండెను. ఇండియా వాయవ్య దేశమును గాంధార మనెడివారు. హిందూదేశమున నుత్తరమునం దంతటను, గంగా, సింధు మైదానములలో ఆర్యులు పెద్ద వలస లేర్పరుచుకొనిరి. ఈ ఆర్యులు భవననిర్మాణచాతురి కలవారై యుందురు. వారిలో పలువురు పర్షియా, మెసపొటేమియాలలోని. తమ వలసప్రదేశములనుండివచ్చి యుందురు. అప్పటికే ఆదేశములందు మహానగరము లుండెను. ఆర్యుల వలసల మధ్యమధ్య అడవులు పెక్కులుండెను. ముఖ్యముగా ఉత్తర దక్షిణ హిందూదేశములకు మధ్య ఒక గొప్ప యడవి యుండెను. ఈ యడవిని దాటి ఉత్తరముననుండి దక్షిణమున కార్యులు వలసకై పోయియుండరు. కాని దేశపరిశోఛనార్థమును, వర్తకముకొరకును, ఆర్యసంస్కృతిని, ఆర్యుల సంప్రదాయములను వ్యాపింపజేయుటకును

  1. రంజీత్, యస్. పండితుడు. జవహర్లాలు భావమరిది. అప్పుడతడు గూడ చెరసాలలో నున్నాడు.