Jump to content

ప్రథమస్కంధము - అధ్యాయము 4

వికీసోర్స్ నుండి

అధ్యాయము-4


శా. సూతా ! యే యుగవేళ నేమిటికి నెచ్చోటన్ మునిశ్రేష్టు నే

శ్రోతల్ గోరిరి యేమి హేతువునకై శోధించి లోకైక వి

ఖ్యాతిన్ వ్యాసుఁడు మున్ను భాగవతముం గల్పించెఁ దత్పుత్త్రుఁ డే

ప్రీతిన్ రాజునకీ పురాణకథఁ జెప్పెన్ జెప్పవే యంతయున్. (1-73)


వ. బుధేంద్రా ! వ్యాసపుత్త్రుండైన శుకుండను మహాయోగి సమదర్శనుం డేకాంతమతి మాయాశయనంబు వలనం దెలిసినవాఁడు. గూఢుండు మూఢుని క్రియ నుండు నిరస్తఖేదుం డదియునుం గాక, (1-74)


తరలము :- శుకుఁడు గోచియు లేక పైఁ జనఁ జూచి తోయములందు ల

జ్జకుఁ జలింపక చీరలొల్లక చల్లు లాడెడి దేవ క

న్యకలు "హా ! శుక" యంచు వెన్క జనంగ వ్యాసునిఁ జూచి యం

శుకములన్ ధరియించి సిగ్గున స్రుక్కి రందఱు ధీనిధీ ! (1-75)


వ. మఱియు నగ్నుండుఁ దరుణుండు నై చను తన కొడుకుం గని వస్త్ర పరిధానం బొనరింపక వస్త్రధారియు వృద్ధుండు నైన తనుం జూచి చేలంబులు ధరియించు దేవ రమణులం గని వ్యాసుండు గారణం బడిగిన వారలు " నీ కొడు కిది సతి, వీఁడు పురుషుండని భేదదృష్టి లేక యుండు. మఱియు నతండు నిర్వికల్పుండు గాన నీకు నతనికి మహాంతరంబు గల" దనిరి. అంత శుకుండు కురుజాంగల దేశంబుల సొచ్చి హస్తినాపురంబునఁ బౌరజనంబులచే నెట్లు జ్ఞాతుండయ్యె ? మఱియు నున్మత్తుని క్రియ మూఢుని తెఱంగున జడుని భంగి నుండు నమ్మహాయోగికి రాజర్షి యైన పరీక్షిన్మహారాజు తోడ సంవాదం బెట్లు సిద్ధించె ? బహుకాల కథనీయంబైన శ్రీ మహాభాగవత నిగమ వ్యాఖ్యాన మే రీతి సాఁగె ? అయ్యోగిముఖ్యుండు గృహస్థుల గృహంబున గోవును బిదికినయంత తడవు గాని నిలువఁడండ్రు. అతండు గోదోహన మాత్ర కాలంబు సంచరించిన స్థలంబులు తీర్థంబులగు. పెద్ద కాలం బేక ప్రదేశమున నెట్లుండె ? భాగవతోత్తముండైన జనపాలు జన్మకర్మంబు లే ప్రకారంబు ? వివరింపుము. (1-76)


సీ. పాండవ వంశంబు బలము మానంబును వర్ధిల్లఁ గడిమి నెవ్వాఁడు మనియెఁ

బరిపంథి రాజులు భర్మాది ధనముల నర్చింతు రెవ్వాని యంఘ్రియుగముఁ

గుంభజ కర్ణాది కురుభట వ్యూహంబు సొచ్చి చెండాడె నే శూరు తండ్రి

గాంగేయ సైనికాక్రాంత గోవర్గంబు విడిపించి తెచ్చె నే వీరు తాత

ఆ.వె. యట్టి గాఢకీర్తి యగు పరీక్షిన్మహా, రాజు విడువఁదగని రాజ్యలక్ష్మిఁ

బరిహరించి గంగఁ బ్రాయోపవిష్టుఁడై, యసువులుండ నేల యడఁగి యుండె. (1-77)


ఉ. ఉత్తమకీర్తులైన మనుజోత్తము లాత్మహితంబు లెన్నడున్

జిత్తములందుఁ గోరరు హసించియు లోకులకెల్ల నర్థ సం

పత్తియు భూతియున్ సుఖము భద్రముఁ గోరుదు రన్యరక్షణా

త్యుత్తమమైన మేను విభుఁ డూరక యేల విరక్తిఁ బాసెనో ? (1-78)


కం. సారముల నెల్ల నెఱుగుదు, పారగుఁడవు భాషలందు బహువిధ కథనో

దారుఁడవు మాకు సర్వముఁ , బారము ముట్టంగఁ దెలియఁ బలుకు మహాత్మా ! (1-79)

    వ్యాసుండు వ్యాకులచిత్తుండై చింతించుట

వ. అని యడిగిన శౌనకాది మునిశ్రేష్ఠులకు సూతున్ డిట్లనియె. తృతీయంబైన ద్వాపర యుగంబు తీఱు సమయంబున నుపరిచర వసువు వీర్యంబున జన్మించి వాసవి నాఁదగు సత్యవతియందుఁ బరాశరునికి హరికళం జేసి విజ్ఞానియైన వేదవ్యాసుండు జన్మించి యొక్కనాఁడు బదరికాశ్రమంబున సరస్వతీ నదీజలంబుల స్నానాది కర్మంబులం దీర్చి శుచియై పరులు లేనిచోట నొంటిఁ గూర్చుండి సూర్యోదయము వేళ నతీతానాగత వర్తమానజ్ఞుండై యా ఋషి వ్యక్తంబు గాని వేగంబు గల కాలంబునం జేసి యుగధర్మంబులకు భువి సాంకర్యంబు వొందు. యుగయుగంబుల భౌతిక శరీరంబులకు శక్తి సన్నంబగు. పురుషులు నిస్సత్త్వులు ధైర్యశూన్యులు మందప్రజ్ఞు లల్పాయువులు దుర్బలురు నయ్యెదరని తన దివ్యదృష్టిం జూచి సర్వవర్ణాశ్రమంబులకు హితంబు సేయందలంచి నలుగురు హోతల చేత ననుష్ఠింపఁదగి ప్రజలకు శుద్ధికరంబులైన వైదిక కర్మంబు లెడతెగకుండు కొఱకు నేకంబైన వేదంబు ఋగ్యజుస్‌సామాధర్వణంబులను నాలుఁగు నామంబుల విభాగించి యితిహాస పురాణంబు లన్నియుఁ బంచమవేదంబని పల్కె, నందు, (1-80)


సీ. పైలుండుఋగ్వేద పఠనంబు దొరకొనె, సామంబు జైమిని చదువుచుండె

యజువు వైశంపాయనాఖ్యుండు గైకొనెఁ , దుది నధర్వంబు సుమంతుఁడు వఠించె

నఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి , రోమహర్షణుఁడు నిరూఢిఁ దాల్చెఁ

దమ తమ వేద మా తపసులు భాగించి, శిష్య సంఘములకుఁ జెప్పిరంత

తే.గీ. శిష్యులెల్లరు నాత్మీయ శిష్యజనుల, కందు బహుమార్గములు సెప్పి యనుమతింపఁ

బెక్కు శాఖలు గలిగి యీ పృథివిలోన, నిగమ మొప్పారె భూసుర నివహమందు. (1-81)


వ. ఇట్లు మేధాహీనులైన పురుషుల చేత నట్టి వేదంబులు ధరియింపంబడుచున్నవి. మఱియు దీనవత్సలుండైన వ్యాసుండు స్త్రీశూద్రులకుం ద్రైవర్ణికాధములకు వేదంబులు విన ననర్హంబులు గావున మూఢుల కెల్ల మేలగునని భారతాఖ్యానంబు చేసియు నమ్ముని భూతహితమందుఁ దన హృదయంబు సంతసింపకున్న సరస్వతీతటంబున నొంటినుండి హేతువు వితర్కింపుచుఁ దనలో నిట్లనియె. (1-82)


సీ. వ్రతధారినై వేదవహ్ని గురుశ్రేణి మన్నింతు విహిత కర్మములఁ గొఱత

పడకుండ నడుపుదు భారత మిషమునఁ బలికితి వేదార్థభావమెల్ల

మునుకొని స్త్రీశూద్ర ముఖర ధర్మములందుఁ బెలిపితి నేఁ జెల్ల దీనఁ జేసి

యాత్మ సంతస మంద దాత్మలో నీశుండు, సంతసింపక యున్న జాడ తోఁచె

ఆ.వె. హరికి యోగివరుల కభిలషితంబైన, భాగవత విధంబుఁ బలుకనైతి

మోసమయ్యెఁ దెలివి మొనయదు మఱచితి, ననుచు వగచుచున్న యవసరమున. (1-83)


    వ్యాసుని కడకు నారదుండు వచ్చి యూఱడించి యుపదేశించిన ప్రకారము


సీ. తన చేయి వల్లకీ తంత్రీచయంబున, సతత నారాయణ శబ్దమొప్ప

నానన సంభూత హరిగీత రవసుధా ధారల యోగీంద్రతతులు సొక్కఁ

గపిల జటాభార కాంతిపుంజంబుల, దిశలు ప్రభాత దీధితి వహింపఁ

దనులగ్న తులసికా దామ గంధంబులు, గగనాంతరాళంబు గప్పుకొనఁగ

ఆ.వె. వచ్చె మింట నుండి వాసవీనందను, కడకు మాటలాడఁ గడఁక తోడ

భద్ర విమలకీర్తిపారగుఁ డారూఢ, నయ విశారదుండు నారదుండు. (1-84)


కం. కనియె న్నారదుఁ డంతన్, వినయైక విలాసు నిగమ విభజన విద్యా

జనితోల్లాసున్ భవదు:ఖ నిరాసు గురుమనోవికాసున్ వ్యాసున్. (1-85)


వ. ఇట్లు నిజాశ్రమంబునకు వచ్చిన నారదు నెఱింగి లేచి వ్యాసుండు విధివత్‌క్రమంబునం బూజించిన నతండు లేనగవు నెగడెడి మొగంబు తోడ విపంచికాతంత్రి వ్రేల మీటుచు నిట్లనియె. (1-86)