ప్రథమస్కంధము - అధ్యాయము 1
అధ్యాయము-1
(అ) పరతత్త్వ ప్రార్థనము :
సీ. విశ్వజన్మస్థితి విలయంబు లెవ్వాని, వలన నేర్పడు ననువర్తనమున
వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుఁడై, తాన రాజగుచుఁ జిత్తమునఁ జేసి
వేదంబు లజునకు విదితముల్ గావించె, నెవ్వాఁడు బుధులు మోహింతు రెవ్వ
నికి నెండమావుల నీటఁ గాచాదుల నన్యోన్యబుద్ధి దా నడరునట్లు
ఆ.వె. త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము, భంగిఁ దోఁచు స్వప్రభానిరస్త
కుహకుఁ డెవ్వఁ డతనిఁ గోరి చింతించెద, ననఘు విశ్వమయుని ననుదినంబు. (1-32)
(ఆ) భాగవత ప్రశంస :
వ. ఇట్లు "సత్యమ్ పరమ్ ధీమహి" యను గాయత్రీ ప్రారంభంబున గాయత్రీ నామ బ్రహ్మరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నధికరించి ధర్మవిస్తరంబును
వృత్రాసుర వధంబును నెందుఁ జెప్పంబడు నదియ భాగవతంబని పలుకుటం జేసి ఈ పురాణంబు శ్రీమహాభాగవతంబన నొప్పుచుండు. (1-33)
సీ. శ్రీమంతమై మునిశ్రేష్ఠ కృతంబైన, భాగవతంబు సద్భక్తి తోడ
వినఁగోరువారల విమలచిత్తంబులఁ జెచ్చెర నీశుండు చిక్కుఁ గాక
యితర శాస్త్రంబుల నీశుండు సిక్కునే ? మంచివారలకు నిర్మత్సరులకుఁ
గపట నిర్ముక్తులై కాంక్ష సేయక యిందుఁ దగిలియుంట మహాతత్త్వబుద్ధి
తే.గీ. పరఁగ నాధ్యాత్మికాది తాపత్రయంబు, నడచి పరమార్థభూతమై యఖిల సుఖద
మై సమస్తంబు గాకయు నయ్యు నుండు, వస్తు వెఱుఁగంగఁదగు భాగవతమునందు. (1-34)
ఆ.వె. వేదకల్పవృక్ష విగళితమై శుక, ముఖ సుధాద్రవమున మొనసి యున్న
భాగవత పురాణ ఫల రసాస్వాదన, పదవిఁ గనుఁడు రసిక భావవిదులు. (1-35)
నైమిశారణ్యవర్ణనము
కం. పుణ్యంబై మునివల్లభ
గణ్యంబై కుసుమ ఫల నికాయోత్థిత సా
ద్గుణ్యమయి నైమిశాఖ్యా
రణ్యంబు నుతింపఁదగు నరణ్యంబులలోన్.(1-36)
వ. మఱియును మధువైరి మందిరంబునుం బోలె మాధవీమన్మథ సహితంబై బ్రహ్మగేహంబునుం బోలె శారదాన్వితంబై నీళగళసభానికేతనంబునుం బోలె వహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమవతీ కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత జటిపటల మండితంబై బలభేది భవనంబునుం బోలె నైరావతామృత రంభా గణికాభిరామంబై మురాసురుని నిలయంబునుం బోలె నున్మత్త రాక్షస వంశ సంకులంబై ధనదాగారంబునుం బోలె శంఖ కుంద ముకుంద సుందరంబై రఘురాము యుద్ధంబునుం బోలె నిరంతర శరానల శిఖా బహుళంబై పరశురాము భండనంబునుం బోలె నర్జునోద్భేదంబై దానవ సంగ్రామంబునుం బోలె నరిష్ట జంభ నికుంభ శక్తియుక్తంబై కౌరవసంగరంబునుం బోలె ద్రోణార్జున కాంచన స్యందన కదంబ సమేతంబై కర్ణు కలహంబునుం బోలె మహోన్నత శల్య సహకారంబై సముద్రసేతు బంధనంబునుం బోలె నల నీప పణసాది ప్రదీపింతంబై భర్గు భజనంబునుం బోలె నానాzశోక లేఖాకలితంబై మరు కోదండంబునుం బోలెఁ బున్నాగ శిలీముఖ భూషితంబై నరసింహ రూపంబునుం బోలెఁ గేసర కరణ కాంతంబై నాట్యరంగంబునుం బోలె నట నటీ సుషిరాన్వితంబై శైలజా నిటలంబునుం బోలెఁ జందన కర్పూర తిలలకాలంకృతంబై వర్షాగమంబునుం బోలె నింద్ర బాణాసన మేఘ కరక కమనీయంబై నిగమంబునుం బోలె గాయత్రీ విరాజితంబై మహాకావ్యంబునుం బోలె సరస మృదు లతాకలితంబై వినతా నిలయంబునుం బోలె సుపర్ణ రుచిరంబై యమరావతీ పురంబునుం బోలె సుమనో లలితంబై కైటభోద్యోగంబునుం బోలె మధుమానితంబై పురుషోత్తమ సేవనంబునుం బోలె నమృత ఫలదంబై ధనజయ సమీకంబునుం బోలె నభ్రంకష పరాగంబై వైకుంఠపురంబునుం బోలె హరిఖడ్గ పుండరీక విలసితంబై నందఘోషంబునుం బోలెఁ గృష్ణసార సుందరంబై లంకానగరంబునుం బోలె రామమహిషీ వంచక సమేతంబై సుగ్రీవ సైన్యంబునుం బోలె గజ గవయ శరభ శోభితంబై నారాయణ స్థానంబునుం బోలె నీలకంఠ హంస కౌశిక భారద్వాజ తిత్తిరి భాసురంబై మహాభారతంబునుం బోలె నేకచక్ర బక కంక ధార్తరాష్ట్ర శకుని నకుల సంచార సమ్మిలీతంబై సూర్యరథంబునుం బోలె నురుతర ప్రవాహంబై జలదకాల సంధ్యా ముహూర్తంబునుం బోలె బహు వితత జాతి సౌమనస్యంబై యొప్పు నైమిశంబను శ్రీవిష్ణు క్షేత్రంబునందు శౌనకాది మహామునులు స్వర్గలోక జేగీయమానుండగు హరిం జేరు కొఱకు సహస్ర వర్షంబు లనుష్ఠానకాలంబుగాఁ గల సత్ర సంజ్ఞికంబైన యాగంబు సేయుచుండి రందొక్కనాఁడు వారలు రేపకడ నిత్య నైమిత్తిక హోమంబు లాచరించి సత్కృతుండై సుఖాసీనుండై యున్న సూతుఁ జూచి,(1-37)
శౌనకాది ఋషుల ప్రశ్న
కం. ఆ తాపసులిట్లనిరి వి, నీతున్ విజ్ఞాన భణిత నిఖిల పురాణ
వ్రాతున్ నుత హరిగుణ సం, ఘాతున్ సూతున్ నితాంత కరుణోపేతున్.(1-38)
మ. సమతం దొల్లి పురాణ పంక్తు లితిహాస శ్రేణులుం ధర్మ శా
స్త్రములున్ నీవు పఠించి చెప్పితివి వేదవ్యాస ముఖ్యుల్ మునుల్
సుమతుల్ సూచినవెన్ని యన్నియును దోఁచున్ నీ మదిన్ దత్‌ప్రసా
దమునం జేసి యెఱుంగ నేర్తువు సమస్తంబున్ బుధేంద్రోత్తమా ! (1-39)
కం. గురువులు ప్రియశిష్యులకుం, బరమ రహస్యములు దెలియఁ బలుకుదు రచల
స్థిర కల్యాణంబెయ్యది, పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్. (1-40)
కం. మన్నాఁడవు చిరకాలము, గన్నాఁడవు పెక్కులైన గ్రంథార్థంబుల్
విన్నాఁడవు వినఁదగినవి, యున్నాఁడవు పెద్దలొద్ద నుత్తమగోష్ఠిన్. (1-41)
చం. అలసులు మందబుద్ధియుతు లల్పతరాయువు లుగ్రరోగ సం
కలితులు మందభాగ్యులు సుకర్మము లెయ్యవి సేయఁజాలరీ
కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై
యలవడు నేమిటం బొడము నాత్మకు శాంతి మునీంద్ర ! చెప్పవే. (1-42)
సీ. ఎవ్వని యవతారమెల్ల భూతములకు, సుఖమును వృద్ధియు సొరిదిఁ జేయు
నెవ్వని శుభనామ మే ప్రొద్దు నుడువంగ, సంసార బంధంబు సమసిపోవు
నెవ్వని చరితంబు హృదయంబుఁ జేర్చిన, భయమొంది మృత్యువు పరుగు వెట్టు
నెవ్వని పదనది నేపాఱు జలములు, సేవింప నైష్కర్మ్య సిద్ధి గలుగుఁ
తే.గీ. దపసు లెవ్వాని పాదంబు దగిలి శాంతి, తెఱఁగు గాంచిరి వసుదేవ దేవకులకు
నెవ్వఁ డుదయించెఁ దత్కథ లెల్ల వినఁగ, నిచ్చ పుట్టెడు నెఱిగింపు మిద్ధచరిత. (1-43)
కం. భూషణములు వాణికి నఘ, పేషణములు మృత్యుచిత్త భీషణములు హృ
త్తోషణములు గల్యాణ వి, శేషణములు హరిగుణోపచిత భాషణముల్.(1-44)
కం. కలిదోష నివారకమై, యలఘు యశుల్ వొగడునట్టి హరికథనము ని,
ర్మల గతిఁ గోరెడు పురుషుఁడు, వెలయఁగ నెవ్వాఁడు దగిలి వినఁడు మహాత్మా ! (1-45)
ఆ.వె. అనఘ ! విను ! రసజ్ఞులై వినువారికి, మాట మాట కధిక మధురమైన
యట్టి కృష్ణు కథన మాకర్ణనము సేయఁ , దలఁపు గలదు మాకుఁ దనివి లేదు. (1-46)
మ. వరగోవింద కథా సుధారస మహా వర్షోరు ధారా పరం
పరలం గాక బుధేంద్ర చంద్ర ! యితరోపాయానురక్తిం బ్రవి
స్తర దుర్దాంత దురంత సుస్సహ జనుస్ సంభావితానేక దు
స్తర గంభీర కఠోర కల్మష కనద్ దావానలం బాఱునే ? (1-47)
సీ. హరినామ కథన దావానల జ్వాలలఁ , గాలవే ఘోరాఘ కాననములు
వైకుంఠ దర్శన వాయు సంఘంబుచేఁ , దొలఁగవే బహుదు:ఖ తోయదములు
కమలనాభ ధ్యాన కంఠీరవంబుచేఁ , గూలవే సంతాప కుంజరములు
నారాయణ స్మరణ ప్రభాకర దీప్తిచేఁ , దీఱవే షడ్వర్గ తిమిర తతులు
ఆ.వె. నళిన నయన భక్తి నావచేఁ గాక సం, సార జలధి దాఁటి చనఁగరాదు
వేయు నేల మాకు విష్ణు ప్రభావంబుఁ , దెలుపవయ్య సూత ! ధీ సమేత ! (1-48)
వ. మఱియుఁ గపట మానవుండును గూఢుండు నైన మాధవుండు రామసహితుండై యతిమానుషంబులైన పరాక్రమంబులు సేసె నఁట. వాని వివరింపుము.
కలియుగంబు రాఁగలదని వైష్ణవ క్షేత్రంబున దీర్ఘ సత్ర నిమిత్తంబున హరికథలు విన నెడ గలిగి నిలిచితిమి. దైవయోగంబున,(1-49)
కం. జలరాశి దాఁటఁగోరెడి, కలము జనుల్ కర్ణధారుఁ గాంచిన భంగిన్
గలిదోష హరణ వాంఛా, కలితులమగు మేము నిన్నుఁ గంటిమి సూతా !1-50)
కం. చారుతర ధర్మరాశికి, భారకుఁడగు కృష్ణుఁ డాత్మపదమున కేఁగన్
ధారకుఁడు లేక యెవ్వనిఁ , జేరెను ధర్మంబు బలుపు సెడి మునినాథా ! (1-51)