Jump to content

పుష్పబాణవిలాసము

వికీసోర్స్ నుండి

శ్రీగోపాలకృష్ణ పరబ్రహ్మణేనమః

రసికజనమనోరంజకంబగు
పుష్పబాణవిలాసంబను
నీగ్రంథంబు
ఉభయభాషాభూషణుండును సకల సుకవి
నికరవిధేయుండునగు,
బిరుదరాజ శేషాద్రిరాజుచే రచింపఁబడి
యందుకు సరియైన మూలంబునందలి శ్లోకముల
తోడను నవతారికతోడను
సరసాగ్రేసరులగు
రాజా శ్రీ వెలుగోటి ముద్దుకృష్ణ యాచేంద్రబహద
ర్వారి యనుజ్ఞవలన
శ్రీ కాశీవిశ్వనాథ ముద్రాక్షరశాలయందు
ముద్రింపఁబడియె
1893. వ స॥ డిసెంబరు నెల

రిజిష్టరు కాపీ రైట్.

శ్రీ.

తే॥

శ్రీల వెలుగొందు రాజ గోపాలకృష్ణ।
భూమివిభునకుఁ బ్రీతిగాఁ బుష్పబాణ।
విలసనంబును దెనుఁగింపఁగడఁగినాఁడ।
రసికసుకవీంద్రులకుఁ జిత్తరంజకముగ॥

శ్రీ

శ్రీహయగ్రీవాయనమః

పుష్పబాణవిలాసము

శ్లో.

కుశలహాటకచేలతటిద్యుతః
ప్రమదదాయిగళాస్వరగర్జితః
రుచిరనంద కుమారకవారిదః
కిరతుమయ్య తులంతుకృపారసం.


శ్లో.

శ్రీమద్గోపవధూస్వయంగ్రహపరిష్వంగేషుతుంగస్తన
వ్యామర్దాద్గళితేపిచందనరజస్యంగేవర్హసౌరభం
కశ్చిజ్జాగరజాతరాగనయనద్వంద్వఃప్రభాతశ్రియం
బిభ్రత్కామపివేణునాదరసికో జారాగ్రణీఃపాతువః ॥


ఉ.

లీలను గోపిక ల్గవుఁగిలింపఁ దదుచ్చకుచాళి తాఁకు బిం
కాల నలందినట్టి సిరిగంథము రాలిన సౌరభాంగుఁడై

క్రాలుచు జాగరారుణిమ కన్గవ మీఱఁ బ్రభాతసద్రుచిం
దాలిచి వేణునాదకలనం దగుజారుఁడు మిమ్ముఁ బ్రోచుతన్.


అ.

కృతికర్త యీగ్రంథాదియందుఁ గావ్యలక్షణాను
సారంబుగ శ్రీకృష్ణదేవరూపమంగళాకారవస్తునిర్దేశమును వా
శీఃప్రయోగంబునుఁ గావించె.


శ్లో.

భువనవిదితమాసీద్యచ్చరిత్రంవిచిత్రం
సహయువతిసహస్రైః క్రీడతోనందసూనోః।
తదఖిలమవలంబ్యస్వాదుశృంగారకావ్యం
రచయితు మనసోమే శారదాస్తు ప్రసన్నా ॥


ఉ.

ఎల్లజగంబులం జనుల కెంతయు నబ్రము గాఁగఁ బల్వురౌ
గొల్లపొలంతులం గలసి కోరిక నాడిన కృష్ణువృత్తి రం
జిల్లుచు నిప్పు డీకృతి రచింపఁగఁ బూనిన నాకు నబ్జభూ
వల్లభయైన భారతి కృపామతితోడఁ బ్రసన్న యయ్యెడిన్.


అ.

ఈకవి తానొర్పంగడంగిన కబ్బంబు నిరంతరాయం
బుగఁ బరిసమాప్తి నొందించుట కుపకరణంబుగ సరస్వతీప్రసా
దంబునుఁగోరె.

శ్లో.

కాంతేదృష్టిపథంగతేనయనయో రాసీద్వికాసోమహాన్
ప్రాప్తేనిర్జనమాలయంపులకితా జాతాతనుస్సుభ్రువః।
వక్షోజగ్రహణోత్సుకే సమభవ త్సర్వాంగకంపోదయః
కంఠాలింగనతత్పరేవిగళితా నీవీదృఢాపిస్వయం॥


ఉ.

కాంతుఁడు గానరాఁ బెనువికాసము గల్గెను గన్నుదోయి కే
కాంతగృహంబుఁ జేరఁ బులక ల్జనియించెము మేననెల్లఁ జ
న్బంతులు పట్టఁగాఁ దలఁచి నన్వడఁకబ్బెను గౌఁగిలింప నా
వంత దలంప నీవి దృఢమయ్యుఁ దనంతనె జారె నారికిన్.

3


అ.

ఇందు నాయికానాయకులు పరస్పరయోగంబున
కుఁ జిరకాలంబు మోహంబుచే బరితపించుచు నొకానొకసమ
యంబున నిరువురకు నేకాంతస్థలంబు దటస్థించిన దర్శనసామీ
ప్యస్పర్శనోద్యోగాదులచేఁ గలిగిన వారిచేష్టలు వర్ణిం
పఁబడియె.


శ్లో.

మాందూరాదరవిందసుందరదర స్మేరాననాసంప్రతి
ద్రాగుత్తుంగఘనస్తనాంగణగళచ్చారూత్తరీయాంచలా।

ప్రత్యాసన్నజనప్రతారణపరా పాణీం ప్రసార్యాంతికే
నేత్రాంతస్యచిరం కురంగనయనా సాకూతమాలోకతే॥


ఉ.

అంగన దవ్వుల న్నిలిచి యాస్యమునం జిఱునవ్వు గ్రాల ను
త్తుంగకుచద్వయంబుపయి దువ్వలు వించుక జారుచుండఁగాఁ
జెంగిటివారివంచనముఁ జేయుచుఁ గంటికడన్ గరంబుఁ జే
రం గదియించి నన్ను సుచిరమ్ముగఁ జూచెడిఁ గోర్కి రాజిలన్.


అ.

ఇందొక ప్రోడయగు పరకీయ దానికిఁగల ప్రేమ నం
గచేష్టితములచేఁ దనకుఁ తెలిపి మరులుకొల్పెనని నాయకుం
డనుఁగు జెలికానికిఁ జెప్పినరీతి వర్ణితంబయ్యె.


శ్లో.

నీరంధ్రమేతదవలోకయమాధవీనాం
మధ్యేనికుంజసదనంచ్యుతపుష్పకీర్ణం।
కుర్యుర్యదీహమణితానివిలాసవత్యో
బోద్ధుంనశక్యమబలేనినదైఃపికానాం॥


ఉ.

బేలరొ చూడు బండిగురువిందలకుంజమునందుఁ బుష్పము
ల్రాల మనోహరంబగుచు రాజిలు నీ నిజనస్థలంబునం

బోలఁగఁ గామిను ల్మణితము ల్రచియింప నెఱుంగ నెవ్వరుం
జాలరు గండుకోయిలలు సారెకు నూరక కూయుచుండుటన్.


అ.

ఇందొక యారామసంకేతంబునఁ బుష్పాపచయ
వ్యాజంబున మెలంగు నాయికకు క్రీడించుట కనుకూలంబగు మ
రుగుచోటు నగపఱచుచు తామచ్చట స్మరతంత్రంబులొనర్చుట
యొరు లెఱుంగుదురోయని దానిమనంబుననుండు శంక దొ
లంగిఁప నాయకుం డాడిన విధంబభివర్ణితంబయ్యె.


శ్లో.

దష్టంబింబధియాధరాగ్రమరుణం పర్యాకులోధావనా
ద్ధమ్మిల్లస్తిలకంశ్రమాంబుగళితం ఛిన్నాతనుఃకంటకైః।
ఆఃకర్ణజ్వరకారికంకణఝణత్కారంకరౌధూన్వతీ
కింభ్రామ్యస్యటవీశుకాయకుసుమాన్యేషాననాన్దాగ్రహీత్॥


చ.

కెరలెడు బింబ మంచు గొఱికెన్ జిగిమోవిని గొప్పు వీడె బ
ల్పరుగున బొట్టు చెమ్మటఁ గలంగుచు జారెను మేను ముండ్లచేఁ
బరియలు వాసె నోసి చెవి వ్రయ్యఁగ గాజులు మ్రోఁగఁ జిల్కకై
తిరిగెదవేల పుష్పవితతి న్గ్రహియించె ననాంద యీవనిన్.

అ.

ఇందొక నాయిక చెలికత్తెలతోఁ బువ్వులు గోయు
టకై యుపవనంబుసొచ్చి మంచిపూదీవెలుపరికించు నపదేశం
బున చెలిమి చేడియల మొఱంగి దూతికతోడ నొక జారనా
యక సంకేతంబుఁ జేరియందాతనితోడ రతి సమ్మర్దసుఖంబు
లనుభవించుతఱి నచ్చటచ్చటపూవులుండు తావులరయుచు క్ర
మక్రమంబుగ నటకుంజేరిన దాని యాడుబిడ్డంగాంచి సంకే
తంబున రతిసుఖవర్తినియగు నాయిక కాడుబిడ్డరాక యెఱు
కపడుటకును తదనంతరసమయంబున నాయికమేనఁదోఁచుజా
రపురుషరచితదంతనఖక్షతాదులగు చిన్నెలు వనంబున గ్రు
మ్మరుటవలనఁ గలిగినవని యాయాడుబిడ్డకు దోఁచుటకును స
మయోచితంబుగ గావలిదూతిక పలికిన తెఱంగును గవి వర్ణించె.


శ్లో

బిభ్రాణాకరపల్లవేన కబరీమేకేన పర్యాకులా
మన్యేన స్తనమండలే నిదధతీస్రస్తందుకూలాంచలం।
ఏషాచందనలేశలాంఛితతనుస్తాంబూలరక్తాధరా
నిర్యాతిప్రియమందిరాద్రతిపతే స్సాక్షాజ్జయశ్రీరివ॥


చ.

చెదరిన కేశపాశ మొకచేత భరింపుచు నొక్కచేత నా

నదవుల జారుపయ్యెద స్తనంబులఁ జేర్చుచు వీటికారుణం
బొదవినమోవితోఁ జిటిలి యూడెడి గంధపుపూతమేనితో
నిదె యొకబోటి మారువిజయేందిర నాఁ బ్రియునిల్లు వెల్వడెన్.


 ఇందొకనాయిక తననాయకునితో రేయంతయుఁ
దనివిదీర మదనతంత్రంబుల సుఖించి యుషఃకాలంబున విటు
నింటనుండి వెలువడిరాగా దానిఁజూచి తదంగఁబులఁ దోఁ
చు రతాంతలక్షణంబులను చేష్టలను గొనియాడుచు నొక
జారపురుషుఁడు మఱియొక జారునితో నుడివినపడు వుగ్గడిం
పంబడియె.


శ్లో.

కాంతో యాస్యతిదూరదేశమితిమేచింతాపరంజాయతే
లోకానందకరోహిచంద్రవదనేనైరాయతేచంద్రమాః।
కించాయంవితనోతికోకిలకలాలాపోవిలాపోదయం
ప్రాణానేవహరంతిహంతనితరామారామమందానిలాఃః॥


చ.

పతి పరదేశ మేగునని వంత జనించెడు నిప్పు డాజగ
ద్ధితుఁడగు చందరుండు కడుద్వేషముఁ బూనెడుఁ గోకిలధ్వను

ల్చతురతఁ బాపి నా కతివిలాప మొనర్చెడు నిష్కుటానిల
ప్రతతులె సౌమ్యత న్విడిచి ప్రాణముల న్హరియించెడుం జెలీ.


అ.

ఇందొకనాయిక తనఃప్రియుం డొకయక్కఱతో పర
దేశయాత్రసేయ సమకట్టు టెఱింగి మనంబునందు మిగులఁ
జింతించి తన చెలిమికత్తియతో నాయకుఁ డెడయైనచో భవి
ష్యత్కాలంబునఁ దనకుం గలుగఁబోవు దురవస్థలం గూర్చి
ముందర వచించిన చందంబు నుడువఁబడియె.


శ్లో.

నవకిసలయతల్పంకల్పితంతాపశాంత్యై
కరసరసిజసంగాత్కే నలంమ్లాపయంత్యాః।
కుసుమశరకృశాను ప్రాప్తితాంగారతాయా
శ్శివశివపరితాపంకో వదే త్కోమలాంగ్యాః॥


చ.

నవముగఁ దాపశాంతికి నొనర్చిన పల్లవశయ్యమీఁదఁ గే
ల్గవఁ గదియించి దాని నతిగాఢముగాఁ గమలించుచు న్మనో
భవశిఖిఁ గ్రాఁగి నిప్పయిన భామిని భూరిశరీరతాపమున్
శివశివ యెవ్వఁ డిట్టిదని చెప్పఁగ నేర్చును ముజ్జగంబులన్.

అ.

ఇందు మనోహరుడగు నాయకుఁడు తడవుగఁ ద
న్నుఁ జేరరాకుండటచేఁ బలువలకాఁకలం గలంగుచుండు నా
యిక యవస్థను గూర్చి దాని బోటికత్తియ యొక్కతె మఱి
యొక్కతుకతో వక్కాణించినవిధంబు నిగదితంబయ్యె.


శ్లో.

 శేతేశీతకరోంబుజేకువలయద్వంద్వాద్వినిర్గచ్ఛతి
స్వచ్ఛామౌక్తికసంహతిర్ధవళిమా హైమీంలతామంచతి
స్పర్శాత్సంకజకోశయోరభినవాయాంతిస్రజఃక్లాంతతా
మేషోత్సాతపరంపరామమసఖేయాత్రాస్పృహాంకృంతతి॥


ఉ.

తమ్మిఁ బరుండెఁ జందురుఁడు తారసమూహము వుట్టెఁ గల్వలం
దిమ్మగు హేమవల్లిఁ దెలు పెల్లెడ మించెను బంకజాతకో
శమ్ములఁ దాఁకి మాల్యములు స్రగ్గె నుపప్లవపఙ్క్తి యిట్టి దొ
క్కుమ్మడి నాప్రయాణమున కోర్వక విఘ్నముఁ జేసె నెచ్చెలీ.


అ.

ఇందుఁ దొలుత బ్రయాణనిశ్చయంబుఁ గావించి త
నచెలికానికిం జెప్పియుండి తత్కాలంబు కడిచినవెనుక మగు
డంగనపడ నాసంగడికాఁడు ప్రయాణంబేల విరమించితని

యడుగ మన్నాయికాసందర్శనకాలంబునఁ దాని కిట్టిదుర్దశ
లు కలుగుటవలననే వెలువడనైతినని నాయకుఁడు జెప్పె.


శ్లో

దూతీదంనయనోత్పలద్వయమహోతాంతంనితాంతంతవ
స్వేదాంభఃకణికాలలాటఫలకేముక్తాశ్రియంబిభ్రతి।
నిశ్వాసాఃప్రచురీభవంతినితరాం హాహాంత చంద్రాతపే
యాతాయాతావశాద్వృధామమకృతేశ్రాన్తాసికాన్తాకృతే॥


చ.

ఉరువుగ వాడె నీదు నయనోత్పయుగ్మము ఫాలవీథి కం
బొరసిన శ్వేదబిందు వది ముత్తెపుకాంతినిఁ బూనె నూరుపు
ల్పరఁగెడు మిక్కుటంబుగను బాయక వెన్నెలలోన సారె సుం
దరి నెఱదూతి నాకయి వృధాశ్రమ మందితె రాకపోకలన్.


అ.

ఇం దొకనాయిక పంపఁగా నాయకుని వెంటఁబెట్టు
కొని రానరిగి యతనితో సురతతంత్రంబుల సుఖించి వచ్చి
యతని యనాగమనహేతువును గపటంబుగ నెఱుకపఱిచిన
దూతిం బరికించి దానియంగంబునందలి రతిశ్రమవలని గురు
తులు గనుంగొని యీతాపికత్తియ పోయిన కార్యఫలంబును

తానే యనుభవించివచ్చినదని నాయికమనంబునకుఁ దోఁపఁ
గా నది యగ్గలంబగునేవ జనించియు దానిని బయలుపఱచకుం
డ గుప్తరోషయయి యాకుంటెనకత్తియతో హితోపలాల
నావాక్యంబులు వలికినవిధంబున తాఁకనాడుట యుగ్గడింపఁ
బడియె.


శ్లో.

అధివసతివసంతేమర్తుకామాదురంతే
నవకిసలయతల్పంపుంజితాంగారకల్పం।
విరహమసహమానాచక్రవాకీసమానా
చకితవనకురంగీలోచనా కోమలాంగీ॥


చ.

సరగవియోగ మోరువక జక్కవ ముద్దియ కుద్దియైన నో
ర్వర బెగడొందియున్న మృగిభంగిని జూచెడి కోమలాంగి తాఁ
బరఁగు వసంతకాలమునఁ బ్రాణముల న్విడ నిప్పుప్రోవుతో
సరియగుచున్న క్రొన్ననలశయ్యపయి న్వసియించె నెచ్చెలీ.


అ.

ఇం దొకనాయిక విరహిజనమానస మదనమాయా
సంతమసంబగు వసంతసమయంబున నాపరాని విరహతాపం

బునోరువంజాలక పరిలిపించుచు మదనవిభ్రమావస్థలం జెం
ది పదియవయవస్థ ప్రాపింపం గమకించుచున్నంజూచి దాని
చెలిక తతియ మఱియొకసకియతో శోకావేశంబునం బలుకు
విధంబు చెప్పంబడియె.


శ్లో.

నైష్ఠుర్యంకలకంఠకోమలగిరాంపూర్ణస్యశీతద్యుతే
స్తిగ్మత్వంబతదక్షిణస్యమరుతోదాక్షిణ్యహానిశ్చితాం।
స్మర్తవ్యాకృతి మేవకర్తుమబలాం సన్నాహమాతన్వతే
తద్విఘ్నః క్రియతే తృణాదిచలనోద్భూతై స్త్వదాస్తిభ్రమైః॥


ఉ.

పైకరవంబు నిష్ఠురత పార్వణ చంద్రుని తీక్ష్ణభావమున్
బ్రాకటదక్షిణానిలు కృపారహితత్వము దానిప్రాణము
ల్పోకడఁబెట్ట సన్నహనముం బచరించుఁ దృణాదికంపము
ల్చేకుర నీవు వత్తువని చేడియ జీవముఁ దాల్చు నీయెడన్.


అ.

ఇందు నాయకాగమనకాలయాపనమును సైపలే
ని నాయికవలన నియమింపఁబడిన దూతిక నాయకునిచెంత
కుంజని యతనితోఁ బ్రియయొక్క తాత్కాలికావస్థనుఁ గూ
ర్చి చెప్పినవిధంబు పలుకంబడియె.

శ్లో.

సాస్రేమాకురులోచనేవిగళతిన్యప్తంశలాకాంజనం
తీవ్రంనిశ్వసితంనివర్తయనవాస్తామ్యంతికంఠస్రజః।
తల్పేమాలుఠకోమలాంగితనుతాంహంతాంగరాగోశ్నుతే
నాతీతోదయితోపయానసమయోమాన్మాన్యధామన్యధాః॥


ఉ.

కన్నుల నీరు నించకుము కాటుక జారును వేఁడియూర్పులం
బన్నకు నిల్పుమీ కుసుమమాల్యము లెల్లను వాడిపోవు నీ
వెన్నఁగ శయ్యపైఁ బొరలె దేటికి గంధపుపూత రాలు నీ
వన్నెమగండు రాఁగలఁడు పైఁదలి వేఱుగ నెంచఁబోకుమీ.


అ.

ఇం దొకనాయిక తననాయకునకు మిగుల నుల్లాసం
బుఁ గల్పించుటకుఁ జక్కఁగ నలంకరించుకొని శయ్యామంది
రంబుఁ జేరి నాయకుని రాక కెదురుచూచుచుండఁగా నాతని
యాగమనంబునకుఁ గాలవిలంబమగుచో నిఁక రాడనినిశ్చ
యించి వగలఁబొగులుచున్న నాయికను జెలికత్తియ యూఱ
డించి పలుకువిధంబు నుడువంబడియె.


శ్లో.

కాచిత్సర్వజనీనవిభ్రమపరామధ్యేసధీమండలం
లోలాక్షిభ్రువసంజ్ఞయావిదధతీదూత్యాసహాభాషణం।

అక్ష్ణోరంజసమంజసాశశిముఖీవిన్యస్యవక్షోజయో
స్స్థూలంభావుకయోస్స్థితంమణిసరంచేలాంచలేనప్యధాత్॥


చ.

చెలియలమూకమధ్యమునఁ జేరినచేడియ నేర్పుమీఱఁ జం
చలమగు కంటిసన్న బొమసన్నల దూతికఁ బల్కరించుచున్
గలయఁగఁ గన్నుదోయి వడిఁ గాటుక నించి కుచద్వయంబుపై
వెలిగెడురత్నహారమును వేగమె కప్పెఁ బయంటకొంగునన్.


అ.

ఇం దొకప్రోడయగు జారనాయిక చెలికత్తియలన
డుమ నుండుసమయంబున తన సమాగమంబున కనువగు సమ
య౦ బడసిరమ్మని విటనాయకుం డంపిన దూతిక రాఁగాఁ దోడి
చేడియల కెఱుకపడకుండ దానితో నాతని రాక కుచితంబగు
వేళను గనుసన్నలచేతను చేష్టలచేతను దెలుపుచు జరపు
ప్రసంగచాతుర్యంబు నిగదితంబయ్యె.


శ్లో.

జిఘ్రత్యాననమిందుకాంతిరధరంబింబప్రభాచుంబతి
స్ప్రష్టుంవాంఛతిచారుపద్మముకుళచ్ఛాయావిశేషస్స్తనౌ।
లక్ష్మీఃకోకనదన్యఖేలతికరావాలంబ్యకించాదరా
దేతస్యాస్సుదృశః కరోతి పదయోస్సేవాంప్రవాళద్యుతిః॥

చ.

వదనము మూర్కొను న్విధునివన్నియబింబముడాలు ముద్దిడు
న్బెదవిఁ జను ల్స్పృశించు నళినీమకుళోజ్వలభావిశేషమున్
గుదురుగఁ గేలు పట్టికొని కోక నదప్రభయాడుచుండు నీ
సుదతికిఁ బాదసేవనము సొంపుగఁ జేయుఁ బ్రవాళకాంతియున్.


అ.

ఇం దొకయెలజవ్వనియగు కామినిమేనిచక్కద
నంబునుఁ గని దానిపై మెండుగు వలపు సందడింపఁగాఁ దన
మోహంబును మనంబున నిలుపఁజాలక యొకసరసుఁడు నిజస
ఖునితో చమత్కారంబుగఁ దానిసొబగును వర్ణించి చెప్పిన
విధంబు పలుకంబడియె.


శ్లో.

దూతిత్వయాకృతమహోనిఖిలంమదుక్తం
నత్వాదృశీపరహితప్రవణాస్తిలోకే।
శ్రాంతాసిహంతమృదుళాంగిగతామదర్థం
సిద్ధ్యంతికుత్రసుకృతానివినాశ్రమేణ॥


ఉ.

చెప్పినకార్యమంతయును జేసితి దూతిరొ లేదు ధాత్రిలో
మెప్పుగ లాతివారలకు మే లొనరింపఁగ నీసమాన నీ

విప్పుడు మన్నిమిత్తముగ నేగి కడు న్వెతలంది తమ్మయో
యొప్పులకుప్ప కష్టముల కోరువకుండినఁ బుణ్య మబ్బునే.


అ.

ఇం దొకనాయిక తననాయకుండు పొలయల్కచే
మనంబునఁ గోపించి తనకడకు రాకున్న నాతని నూఱడించి రమ్మని
దూతికఁ బంచిన నది పోయి తన చక్కఁదనంబుచేతను నే
ర్పుచేతను నాయకునిఁ గైవసంబు చేసికొని తనివిదీర మరుకేళిం
గూడివచ్చి నీసందేశంబు నెఱవేర్చివచ్చితినని బొంకి పలుకఁ
గా దాని యప్పటియునికింగాంచి దానియొక్క స్వప్రయో
జననిర్వాహకత్వంబు నెఱింగి మనంబున నంకురించు రోపం
బునుఁ గప్పికొని దూతింగొనియాడువిధంబున గ్రహించు నా
యిక వాక్చమత్కారంబు వర్ణితంబయ్యె.


శ్లో.

నబరీభరీతికబరీభరేస్రజో నచరీకరీతిమృగనాభిచిత్రకం।
విజరీహరీతినపురేవమత్పురోవివరీవరీతినచవిప్రియంప్రియా॥


ఉ.

క్రొమ్ముడియందుఁ బూసరులు గూరుప దీప్రియ నేఁ డిదేమి తా
నెమ్మొగమందుఁ గస్తురిని నీటుగ బొట్టిడదేమి వేడ్కఁ బూ

ర్వమ్మును బోలె నాయెదుట రాగిలియాడ దిదేమి నాదుపై
నిమ్మహిమంతు వున్నవచియింప దదేమి మదేభగామినీ.


అ.

ఇం దొకనాయిక తనకడకు నాయకుండు రాఁగాఁ జెలి
కత్తియ లాతనిపై నేరములు పెట్టియుండుటచేఁ గోపోద్దీపనం
బు మనంబునఁ బెనఁగొనఁగా నలంకారవివర్జితయై యాద
రింపమిఁగని చింతాకులుండై దానితోడి చేడియలయం దొ
క్కతుకతో నానాయకుండు వలికినవిధంబు వర్ణింపంబడియె.


శ్లో.

గూఢాలింగనగండచుంబనకుచస్పర్శాదిలీలాయితం
సర్వంవిస్మృతమేవవిస్తృతవతోబాలేఖలేఖ్యోభయాత్।
సల్లాపోస్త్వధునాసుదుర్ఘటతమస్తత్రాపినాతివ్యధా
యత్త్వద్దర్శనమప్యభూదసులభంతేనైవదూయేభృశం॥


చ.

ఖలజనభీతి గూఢముగఁ గౌఁగిటఁ జేర్చుట గండచుంబనం
బులుఁ గుచమర్దనంబులను పుణ్యము విస్మృత మయ్యె నొండొరున్
బొలుపుగ మాటలాడుటయుఁ బోయె నటైనను నేను చింతిల

న్గలికిరొ నీదుదర్శనమె కామికి నేఁ డెదలోన గుందెదన్.


ఇందు రూపరేఖావిలాసాదులచేఁ దమి బుట్టించి యా
లింగనాదులకు లోఁబరచి కొంతకాలంబు గూఢంబుగ రమి
యింపఁ దాని నెఱింగినఖలురుపలువు రాకాంతను నిందింపు
చుండ సంభోగంబు మాని యవలసమయం బబ్బినతఱి మనో
రథసూచకంబులగు చతురభాషణంబులఁ దనివినొందుచుండ నా
మేలునకు చూపోపక యేవగొనువారివలనిభయంబున సరసస
ల్లాపాదులం ద్యజించి నేత్రానందంబుగ నొండొరుఁ జూచికొ
నుటయుంగూడ మానుకొనియుండఁగాఁ గొంతకాలంబు సన
దైవికంబున నొకదివసంబున నొకరహస్యస్థలంబున తటాలు
న నెదురుపడిన జారిణిం జూచి జారనాయకుఁడు ఖేదాకులుఁ
డై పలికినవిధంబు వర్ణింపఁబడియె.


శ్లో.

యాచంద్రస్యకళంకినోజనయతిస్మేరాననేనత్రపాం
వాచామందిరకీరసుందరగిరోయాసర్వదానిందతి।

నిశ్వాసేనతిరస్కరోతికమలా మోదాన్వితాన్యానిలాన్
సాతైరేవరహస్త్వయావిరహితా కాంచిద్దశాంనీయతే॥


చ.

నలు పెదఁ దాల్చు జాబిలికి నవ్వుమొగంబున సిగ్గు గొల్పుచున్
బలుకులచేత గేహశుభాషల మాటికి నీసడించుచున్
జలరుహసౌరభానిలుని శ్వాసమునం బొరి ధిక్కరించు నా
నెలఁతకు నీవు రామినవె నేఁడొకదుర్దశఁ గూర్చె నీసునన్.


ఇం దొకనాయిక నాయకుం డెక్కారణంబుననో
యొకరేయి తనయింటికి రా మసలిన యంతమాత్రమునకే వి
యోగసంతాపంబు నోరుపంజాలక తనదూతిక నతనిపాలి
కిం బంపఁగా నది పోయి చేరి నాయకునితోఁ బలికిన చందంబు
వర్ణింపఁబడియె.


శ్లో.

తన్వీపాయదిగాయతిశ్రుతికటుర్వీణాధ్వనిర్జాయతే
యద్యావిష్కురుతే స్మితానిమలినైవాలక్ష్యతేచంద్రికా।

ఆస్తేమ్లానమివోత్పలంనవమపీ స్యాచ్చేత్పురోనేత్రయో
స్తస్యాశ్శ్రీరవలోక్యతేయదితటిద్వల్లీవివర్ణైవసా॥


చ.

వనిత యొకింత పాడిన విపంచిరవంబు వినం గఠోరమై
చను నిసుమంత నవ్వునెడఁ జంద్రికయు న్మలినంబె యై తగున్
గనుఁగవమ్రోల గ్రొందొగుఁ గ్లాంతిని జెందిన జాడ దోఁచుఁ ద
త్తనురుచిఁ జూచుచో మెఱుపు తద్దవివర్ణమయై కనంబడున్.


అ.

ఇందొక కాముకుం డొకానొకసుందరింజూచి దాని
పై మోహవిభ్రాంతికలవాఁడై దాని రూపవిలాసకళావైశ
ద్యంబులను తనప్రియసఖునితో నుడివిన విధంబు వర్ణింపం
బడియె.


శ్లో

సత్యంతద్యదవోచధామమమర్హా రాగస్త్వదీయాశ్రిత
త్వంప్రాప్తోసివిభాత ఏవ సదనంమాంద్రష్టుకామోయతః।
రాగంకించభిభర్షినాథహృదయేకాశ్మీరపత్రోదితం

నేత్రేజాగరజంలలాటఫలకేలాక్షారసాపాదితం॥


చ.

రమణ నిజంబు నీకుఁగల రాగముకంటెను నాదు రాగమే
సమధికమన్న దీ విపు డుషస్సమయంబున నిందురాఁగఁ గు
కుమరసరాగ మీయెదను గుంభితజాగరరాగ మక్షులన్
గ్రమమున నీయలక్తకృతరాగము ఫాలమునందుఁ దాల్చెదౌ.


అ.

రేయంతయు పరతరుణితోడంగూడి మదనతంత్రం
బుల ననుభవించి రేపకడ వచ్చిన మనోహరుంగని తదీయ
సంగమలక్షణంబులు తన నెమ్మనమ్మున నుమ్మలికంబుఁ గూర్ప కో
పగోపనంబుఁ గావించి తనపైఁ బతికింగల మక్కువ తెల్లంబగు
నట్లు నెపమిడి మర్మోద్ఘాటనంబుఁ గావించు నాయికావచనచ
మత్కృతి యిందుఁ బొందుపఱచియున్నది.


శ్లో.

ఏతస్మిన్ సహసావసంతసమయే ప్రాణేశ దేశాంతరం
గంతుంత్వం యతసే తథాపి నభయం తాపాత్ప్రపద్యేధునా।
యస్మాత్కైరవసారసౌరభ ముషాసాకంసరోవాయునా
చాన్ద్రీదిక్షువిజృమ్భతేరజనీషుస్వచ్ఛామయూఖచ్ఛటా॥

ఉ.

ఆమనివేళ నెంతయు రయంబున దూరపుయాత్ర సేయఁగా
నీమది నెంచె దట్లయిన నే వెఱవన్ బరితాపవహ్నికిన్
స్వామినితాంతము న్గుముదసౌరభమై తగుగాలితోడ నీ
సోమమయూఖము ల్దెసల సొంపుగ రే ల్గడుపెంపుఁ జెందెడిన్.


అ.

ఇందు నాయకుండు వసంతసమయంబునఁ బరదేశ
యాత్రాగమనోన్ముఖుఁడు కాఁగాఁ గాంచి తద్వియోగంబు
సైరింపంజాలని నారీమణి తత్ప్రయాణంబు నంగీకరింపకయు
నంగీకరించినచందంబునఁ బలికినది కవి వర్ణించె.


శ్లో.

చక్షుర్జాడ్యమవైతుమానినిముఖం సన్దర్శయశ్రోత్రయోః
పీయూషస్రుతిసౌఖ్యమస్తు మధురాం వాచం ప్రియే వ్యాహర।
తాపశ్శౌమ్యతుమేప్రసాదశిశిరాందృష్టింశనైఃపాతయ
త్యక్త్వాదీర్ఘమభూతపూర్వమచిరాద్రోషంసఖీదోషజం॥


ఉ.

కన్నులజాడ్య మేగును మొగం బిటు చూపుము నేత్రము ల్సుధా
త్యున్నతసౌఖ్యమందు నిపు డుగ్మలితీయనిమాట లాడుమీ
పన్నుగబోంట్లబోధనలఁ బాటిలు రోసము నుజ్జగించి వే

మిన్నక నాదు తాపము శమింపఁగ శీతలదృష్టిఁ జూడుమీ.


అ.

చెలిమిపొలంతులు దనపై నేరము లపారంబుగ నారో
పించి చెప్పుటంజేసి మొగమెత్తిచూపక యించుక చూపియుం
బలుకక పలికియు సౌమ్యంబులాడక నాడియు చుఱుకుచూపు
లఁబఱపు గరితంగని యెమ్మెకాఁడు వినయమ్మున ననునయిం
చుతెఱం గిం దుపన్యస్తమయ్యె.


శ్లో.

మానమ్లానమనామనాగపినతం నాలోకతేవల్లభం
నిర్యాతేదయితేనిరంతరమియం బాలాపరంతప్యతే।
ఆనీతేరమణేబలాత్పరిజనైర్మౌనంసమాలంబతే
ధత్తేకంఠగతానసూన్ప్రియతమేనిర్గంతుకామేపునః॥


ఉ.

మానిని తీవ్రరోషగరిమ న్వినతుం బతిఁ జూడకుండు నా
ప్రాణవిభుండు పోయిన నిరంతరతాపము నొందు నెచ్చెలు
ల్వానిని దెచ్చి నన్బలిమి వారక మౌనముఁ బూనుఁ గ్రమ్మఱం

బో నతఁ డుద్యమింప వెత బొంది గళంబున దాల్చుఁ బ్రాణముల్.


అ.

పొలయలుకచేతం గలిగిన సంతాపంబు ప్రబలుతరిఁ
బ్రియుండు పెక్కుభంగుల వేడిన నాదరింపక యతండు వెడలి
నంతనె మిగుల వగలంబొగులు మగువ తెఱంగు దాని చెలి
యోర్తు మఱియొక్కతెకుఁ బలికినవిధం బభివర్జితంబయ్యె.


శ్లో.

కర్ణారుంతుదమేవకోకిలరుతంతస్యాశ్శ్రుతేభాషితే
చంద్రేలోకరుచిస్తదాననరుచేఃప్రాగేనసందర్శనాత్।
చక్షుర్మీలన మేవతన్నయనయోరగ్రేమృగీణాంవరం
హైమీవల్ల్యపితావదేవలలితాయావన్నసాలక్ష్యతే॥


చ.

సతి వలుకంగఁ కర్ణపరుషంబగుఁ బైకని నాద మీప్రజా
ప్రతతకిఁ జంద్రునందు రుచి భామమొగంబును జూచునంతకే
వితతమృగాకన ల్వెలఁది వీక్షణసన్నిధిఁ గన్నుమూయు బో
యతులితహేమవల్లియుఁ దదంగముఁ జూడ సుందరం బగున్.

అ.

సాటిలేని రూపరేఖావిలాసంబుల సరసులమరుబా
రింద్రోయు నొకతోయజాక్షి జూచి తమకంబు మితిమీరుచుం
డ నొకవిటుండు దాని సోయగంబు మొదలుగాఁగల గుణం
బులఁ జెలికానికిం బలుకుచెలువు నిందు వర్ణించినాఁడు.


క.

శ్రీముద్దులకృష్ణధరి
త్రీమఘవునివంది భారతీశేషకవి
గ్రామణిశిష్యుండ సదృశ
శేముషి శేషాద్రికవి రచించెన్ దీనిన్.

పుష్పబాణవిలాసము
సంపూర్ణము