ఉపోద్ఘాతము
ఆంధ్రసారస్వతము, భారతరూపమున ను ప్రతిష్ఠితమైనది మొదలు ఆ జేడుశ తాబ్దులు, బహుళముగా చంపూకావ్యములును, సకృత్తుగా నిర్వచన ప్ర బంధములును వెలసిన వేకాని, పేరుగల ఒక్క వచన గ్రంథ మైనను తలసూపలేదు. గద్యపద్యాత్మకములైన చంపువులు ఉభయ తారకములగును గదా యన్న నిబ్బరముచేతనో, గద్యము పద్యము వలె ధారణాయోగ్యము కాదన్న అనుమానము చేతనో, పద్యర చనవలె గద్యరచన యశోదాయకము కాదన్న నిరసన భావము చేతనో, మన పూర్వకవులు ప్రత్యేక వచనరచలను ఆదరింపరైరి. కానిచో, సంస్కృత మున ఉత్త మగద్య కావ్యములగు కాదంబరి దశకుమార చరిత్రలు సయి తము, తెనుగున చంపువులుగానే అవతరించుటకు హేతువుండదు.
ఇట్లుండగా, వచన గ్రంథములు అభావమువలని లోటును గ్రహించి, దక్షిణాంధ్రకవులు ఆ కొఱతను తీర్పసమకట్టిరి. మధుర, తంజావూరు, మైసూరు మొదలగు సంస్థానాధీశ్వరులు, 17, 18 శతాబ్దులలో పెక్కువచన గ్రంథములు వ్రాయించుటే కాక, వారిలో కొందఱు స్వయముగా కొన్ని రచించిరి. కాని, అవి ఆంధ్ర భారత భాగవతాది పురాణేతిహాసములకును, మణికొన్ని పూర్వ ప్రబంధములకును దండా స్వయప్రాయములగు వచనరూపములే కాని, స్వతంత్రరచనలు కావు. అందుచే, నానికి, చారిత్రక ప్రాధాన్యమున్నంత సాహిత్య ప్రతిష్ఠ లేదు.
అసలు స్వతంత్ర వాఙ్మయ శాఖగా పరిగణింపదగిన వచనావిర్భావము, మనభాషలో అధునాతనమే యని నిస్సంశయముగా చెప్పవచ్చును. ఆంగ్లేయులు మనకొసగిన విద్యాసంస్కారమువలన మనభాషకు కల్గిన మేలేమైన ఉన్న యెడల అది యిదొక్కటే. వారిభాషలో ఉన్నంత కావ్య పక్రియావైవిధ్యము మనభాషలో పూర్వములేదు.