పుట:Venoba-Bhudanavudyamamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రామదానము.

భూదానవుద్యమము వ్యాప్తినొందినకొలది, వుద్యమరూపము పలువిధములుగా విజృంభించెను. ఉత్తరప్రదేశ్ లో వినోబాజీ పర్యటించునపుడు బీహారులో పర్యటించునపుడు కొన్నిగ్రామములు గ్రామదానములుగా యివ్వబడెను. గ్రామదానము యన్నపుడు గ్రామములో భూమికి యజమాని యెవరు యుండరు. గ్రామములోని భూమియున్న వారందరు తమభూమియంతయు దానముగా నిచ్చెదరు. భూమియంతయు గ్రామానిదే. గ్రామదానవ్యాప్తి యెక్కువగా ఒరిస్సాప్రాంతములో జరిగెను. ఒక కొరాపుట్టిజిల్లాలోనే 700 గ్రామములవరకు దానముజరిగెను. ఒరిస్సా ప్రాంతములో 850 గ్రామములు దానముగా యివ్వబడెను. కొరాపుట్టిజిల్లాలో దొరికిన గ్రామదానములవలన భూదానవుద్యమరూపములో కొత్తదనమొచ్చెను. సర్వసేవా సంమమువారు దొరికిన గ్రామములలో, ఆదర్శప్రాయమైన. గ్రామస్వయంపోషకత్వ జీవితము నడిపించుటకు పూనుకొనినారు. ప్రతిగ్రామములో తిండిలేనివారు, గుడ్డలేనివారు యుండకూడదు. పరిశ్రమలమీద ఆధారపడిన నూతనవిద్యావిధానముతో యందరికి విద్యలభించునట్గు చూచెదరు. నిరుద్యోగసమస్య యుండకుండ చూచెదరు. ఆరోగ్యము, పరిశుభ్రత, వైద్యసహాయము, వ్యవసాయ అధికోత్పత్తి, గ్రామపరిశ్రమలు, వీటిని అమలుపరచుటకు కార్యకర్తల సహాయముతో పనిచేయుటకు సర్వసేవాసంఘ కార్యదర్శి అన్నాసాహెబ్ సహస్రబుద్దిగారు యక్కడనే వుంటున్నారు. ఉద్యమానికి ఆదర్శపుదారి, గ్రామరాజ్యమునకు సందోహమిచ్చే పునాది గ్రామదానమే. ఈ గ్రామములను చూచుటకు, కార్యకర్తలుగా పనిచేయుటకు దేశములోని అన్నిప్రాంతములవారును, సర్వోదయమునందు నన్ముకముగల విదేశీయులును వచ్చుచున్నారు.

గ్రామములో భూమిలేనివారుండకూడదు.

భూమియంతా గ్రామానిదే.

గ్రామములో భూయజమానులుండకూడదు.

సమాప్తి.

__________