పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 106

ఇతరులమాట యిట్లుండఁగా తెనుఁగువారిలోనే వేమనవంటివారు పలువ రున్నారు. వేమనవంటివారనంగా అతని మతమువంటి మతము నాశ్రయించిన వారు ; బహిరాడంబరములను వదలి, జాతిభేదాదులను తిరస్కరించి, యోగసాధనముచే అద్వైతమును సాధించినవారు ; లేక సాధింపఁ దలఁచినవారు-అట్టివారిలో నొక్కఁడు.

పోతులూరి వీరబ్రహ్మము

జాతిచే నితఁడు కంసాలి. ఇతని కాలము సుమారు పదునేడవ శతాబ్ద మధ్యము. వేమన్నను గూర్చి మనము నిర్ణయించిన కాలమే సరియైనచో నితఁ డతనికి సమకాలికుఁడగును. స్థలము పోతలూరు. కర్నూలు మండల మందలి బనగానపల్లెలోనుండిన గరిమ రెడ్డి వెంకటరెడ్డి యను నాతని యింట ఇతcడు చిన్నప్పుడు పసులఁ గాచుచుండెను. ఆ వయసునందే యితఁడనేకాద్భుత కార్య ములు చేసెను. చచ్చినవారిని బ్రతికించెను. ఊరిదేవరజాతరలో యితని యాజ్ఞ ప్రకారము అందఱియెదుర చండికావిగ్రహము లేచివచ్చి యితనికి చుట్ట కాల్చు కొనుటకు నిప్పుదెచ్చి యిచ్చెనఁట ! ఈతఁడును విగ్రహారాధనలు, జాతిభేదములు, జాతరులు మొదలగువానిని ఖండించి |ప్రజలకు హితోపదేశము చేసెను. ఇతఁడు సన్న్యాసిగాఁడు. గొప్ప సంసారి. భార్య గోవిందమ్మ. ఐదుగురు కొడుకులు, ఒక్క కూఁతురును ఉండిరి. ఇతని శిష్యులందరిలో దూదేకుల సిద్ధయ్య ప్రసిద్ధుఁడు. పండ్రెండేండ్ల చిన్నవయస్సునందే తన మహమ్మదీయ మతమును తల్లిదండ్రులను వదలి వీరబ్రహ్మము నాశ్రయింపఁగా, అతఁడును నిరాక్షేపముగా నితనిని శిష్యునిగా నంగీకరించి బోధించెను. ఈ గురుశిష్యుల భక్తి వాత్సల్యములు చాల మనసును కరఁగించునట్టివి. శిష్యుని కొఱకితఁడు 'సిద్దబోధము' అను గ్రంథమును వ్రాసె నcట. అందులోని వీ క్రింది రెండు పద్యములు :

              "క. నీవను నేనును తానును
                   భావింపఁగ నొక్కఁడనుచుఁ బరఁగెఁడు గాదే
                   నీవును నిన్నెవీఁగినచో
                   నీవేయఁగు దాను నేను నిజముగ సిద్ధా!"

               "క. నీలోన వెలుఁగు నెయ్యది
                    నాలోనను వెలుఁగునదియె నఖిలంబున దా
                    నాలోకనంబు గలిగిన
                    నీలోననె గాంతువయ్య నిజముగ సిద్ధా!"*[1]

ఇతcడును వేమన్నవలె సర్వసమత్వముగల యద్వైత విద్యను బోధించు పెక్కు పద్యములను పాటలును వ్రాసినట్లున్నది. కాని నా కవి యొక్కువగా లభింప లేదు. *పోతులూరి వీరబ్రహ్మముగారి నాటకము" అసు గ్రంథమున కొన్ని కలవు గాని యవి నాటకకర్త ప్రాసినవో, వీరబ్రహ్మము వ్రాసినవో చెప్పలేను. ఒకటి మచ్చుకు -

  1. * బెజవాడ టి, వి, రాఘవాచార్యులు గారు ప్రకటించిన వీరాచార్య చరిత్రము', పు. 17. ఇందలి విషయము లీ గ్రంథమునుండియే గ్రహింపఁబడినవి. ఇది గాక తప్పుల తడకల గుజిలీ ప్రతి యొకదానిలో కొన్ని పాట లిటీవల చూచితిని.