పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెనుక శాస్త్రులవారు విశాఖపట్టణము హిందూ హైస్కూలు ద్వితీయోపాథ్యాయులుగాను రాజమహేంద్రవరము టౌను స్కూలు ప్రథానోపాథ్యాయులుగాను నుండిరి. రాజమండ్రికిపోయిన క్రొత్తలోనే యొకవిశేషము జరిగినది. ఆ బడిలో క్రొత్తగా నొక టీచరు రాఘవయ్యనాయడని వచ్చియుండెను. దేవరకొండ గోపాలశాస్త్రులవారిని తెలుగుపండితులు నుండిరి. ఈ శాస్త్రులవారికి ఒకకన్ను కాయ. వేంకటరాయశాస్త్రులవారు అందులకు కారణమడుగగా, మథ్యాహ్నము బాలురు స్కూలు గదులలోనే ఱాలతో ఒకరినొకరు కొట్టుకొనుటలో నొకఱాయితగిలి గోపాలశాస్త్రులవారి కన్ను పోయినదని ఆపండితులే చెప్పిరి. అంతట శాస్త్రులవారు బాలురను 1 - 2 గంటల సమయములో స్కూలు వరండాలలోనే యుండునట్లు నియమించి యుపాథ్యాయులకు, సర్క్యులరు ఒకటి పంపిరి. బాలురను ప్రవచనము చెప్పెడు గదులలోనికి ఆ సమయమున రానీయవలదనియు, రాలు రువ్వుట లోనగు దారుణ క్రీడలు ఆడనీయవలదనియు, వారిని గదులలోనికి పనియున్న రప్పించుకొని వెంటనే పంపివేయవలసినదనియు, వారితో ఆగంటలో ఉపాథ్యాయులు గోష్ఠి పెట్టుకోరాదనియు అందు వ్రాసిరి. దానిని చూచినందులకు గుఱ్తుగా నందఱను అందు సంతకము చేయవలసినదిగా హెచ్చరించిరి. అట్లే ఉపాథ్యాయులందఱును ఆసర్క్యులరులో సంతకము చేసిరి.