పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4-ప్రకరణము

ఉద్యోగదశ

ఆదినములలో ఎందఱు పరీక్షలోతేరిన నందఱకును ఉద్యోగము లిచ్చుచుండువారు. ఆపరీక్షలో నుత్తీర్ణులయిన వెనుక దొర శాస్త్రులవారికి ఉద్యోగమును సిఫారసుచేయలేదు శాస్త్రులవారు వెంటనే పై దొరలకు వ్రాసికొనిరి. పైదొరలు విచారింపగా వీరిప్రిన్సిపాలు 'వెంకటరాయడు పెంకె, మనము చెప్పిన పనులు చేయడు, అధికప్రసంగి అతనికి రాజమండ్రిలోనే ఉద్యోగము కావలెను, మనము పంపిన యూళ్లకంతయుపోడు,' అని బదులు వ్రాసెను. శాస్త్రులవారు ఇదంతయు నబద్ధమనియు, ఎచటికి దొరతనమువారు పంపుదురో ఎంత జీతమునకు పంపుదురో అన్నిటికిని ఒప్పుకొని యున్నారమని చాలవినయముగా వ్రాసికొనిరి. అంతవిధిలేక శ్రీకాకుళము హైస్కూలులో కడపటి యుపాథ్యాయునిగా పన్నెండు రూపాయల జీతముపై శాస్త్రులవారిని నియమించిరి. ఇది యొకవిశేషము, ఎఫ్ ఏ,. ప్యాసై అంతకొంచెము పాటి జీతమునకు ఆంధ్రు లెవరును ఉద్యోగము చేయువారు కారు. శ్రీకాకుళములో కొందఱు శాస్త్రులవారిని 'ఏమండీ, శాస్త్రులవారూ, ఎఫ్.ఏ., చదివి ఇంతకొద్దిజీతానికి ఎలాగొప్పుకొని ఒచ్చారండీ? మేము వెళ్లమండి. మీరుదక్షిణాదివాళ్లండి, నెల్లూరు సీమనించి ఇంతదూరం ఈ రవంత జీతానికోసం వచ్చారండీ?' అని యడుగువారట.