పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రాచీన కాలంలో ట్యుటానిక్ జాతులవారు ఎవరైనా స్వతంత్రుడు బానిసతో వివాహ సంబంధం నెరపితే అతనిని బానిసనుగా చేసేవారు. అటువంటి పనికి పూనుకున్నప్పుడు ఆమెను చంపివేసేవారు.

స్కాండినేవియన్ జాతుల్లో ఎక్కువ కాలం బానిసత్వం నిలవలేదు. జర్మనీలో అది 'సెర్ఫ్ డం గా మారింది. పుట్టుకతో సామ్యం (Equality of Birth) ఉంటేగాని వివాహానికి అవకాశం లేదు. జర్మనీ స్కాండినేవియాలలో క్రమక్రమంగా ప్రభుజాతి భిన్నమై పోయింది. ప్రభుజాతి వ్యక్తికీ, బానిసకూ ఏ కారణం చేతనైనా వివాహబంధం ఏర్పడితే దానిని దుష్టబాంధవ్యము (Mis-alliance) గా భావించేవారు. ప్రప్రథమంలో అటువంటి వివాహాలు చేసుకున్నవారు ఆర్థిక దుర్దశకు పాలైనారు. చాలాకాలం వరకు వారి సంతానానికి పౌరసత్వపు హక్కులు లభించలేదు.

చాలా సందర్భాలలో వర్గసంబంధమైన కూటాంతర వివాహ విధానానికి (Class Endogamy) జాతి వైషమ్యమూ, దేశ వైషమ్యమూ కారణాలు. అన్యదేశీయ దండయాత్రల ఫలితంగా సాంఘిక విభేదాలు ఏర్పడి ఉంటవి. జయించినవారు ప్రభువులూ, జితులు బానిసలూ ఔతుంటారు. వారి ఇరువురి మధ్యా వైవాహిక బాంధవ్యాలు ఉండేవి కావు.

సంస్కృత భాషలోని వర్ణశబ్దానికి 'రంగు' అని అర్ధము. దీనినిబట్టి వర్ణభేదం ఎలా ఏర్పడి ఉంటుందో మనం ఊహించవచ్చును. ఉత్తమ వర్ణం గల ఆర్యులు అనార్యులను జయించి బానిసలనుగా పరిగణించి ఉంటారు. తరువాతి కాలంలో వర్ణశబ్దం కులవిభేదాలను తెలియజేస్తూ వచ్చింది.

ఆర్యజాతి ఏర్పడక పూర్వం భారతదేశంలో నీలవర్ణులైన జాతుల వారుండేవారు. వారే దస్యులు. కాలక్రమేణ వారు ఆర్యులకు బానిసలై పోయినారు. విజేతలైన ఆర్యులలో మొదట స్త్రీల సంఖ్య అతిస్వల్పంగా ఉండేది. ఆ కారణం చేత అనార్యజాతి కన్యకలనూ, స్త్రీలనూ వివాహం చేసుకున్నారు. తరువాత తరువాత అటువంటి అగత్యం లేకపోవటం వల్ల అంతర్వివాహ విధానాన్ని వారు అరికట్టినారు. అంటే కూట బాహ్యవివాహాన్ని అంగీకరించటం మానివేసినారన్నమాట.

నార్మనుల దండయాత్రకు పూర్వం ఆంగ్లదేశానికి శాక్సనులు ప్రభువులు. తరువాత నేటి జర్మనీ ప్రాంతీయులూ, గాలులూ అయిన నార్మనులు ఆ దేశాన్ని జయించినారు, ప్రభువులైనారు. రోమను జాతిలోని 'పెట్రీషియనులు' మొదట ప్రభువర్గంవారు కారు.


సంస్కృతి

227