ఆ ఆనందమును పట్టజాలక భార్యను పిలిచి "ఇదుగో ! ఇక చూడు నా తెలివితేటలు! ఇంతవరకు చూపించుటకు ఉద్యోగములో నిలువ(త్రొక్కుకొన వలసి వచ్చినది. రేపటి నుండియు మనకు అంతయును డబ్బే!" అనినాడు.
మరునాడు ప్రతిదినము కంటె పెందలకడ లేచి అతడు సముద్రతీరమునకు పోయెను. తన అరుగుపై కూర్చుండి అలలను తీక్షణముగ లెక్కించుచు పెద్ద పుస్తకముపై లెక్క వ్రాయుచుండెను.
ఒక ఓడ నిండుగ నిలువైన సరుకులు నింపుకొని తీరము మీదుగ పోవుచున్నది. దానిని చూచి బ్రాహ్మణుడు ఉగ్రుడై ఓడ కెప్తానును కేకపెట్టి పిలచెను.
అతడు దగ్గరకు వచ్చిన తరువాత “నీవేమి కొంత కాలము బ్రతుకదలచ లేదా? పాదుషాగారి పని పాడైపోవుచున్నది. నీ ఓడ వలన అలల లెక్క చెడిపోవును. ఓడను ఇటు రానీయకుము. అటు దూరముగ ఆ కొండల వెనుకనుండి తీసుకొని పొమ్ము! లేకున్న ఓడపై జోడుగుండ్ల బారు వేయింతును!" అని గర్జించి పలికెను.
ఓడ కెప్తానుకు ఆ బ్రాహ్మణుడు ప్రభుత్వోద్యోగి అని తెలియును. అతడు ఏమి చెప్పిన పాదుషా అది నమ్మును. కొండల వెనుక నుండి పడవ నడిపించుకొని పోవుదుము అన్న ఏ కొండ రాయికో కొట్టుకొనును. ఓడ దెబ్బ తినును. నష్టము వచ్చును. ఓడపై విలువ గల సరుకులు ఉన్నవి. వానిని తీరగ్రామములకు చేర్చుచు పోవలయును. ఎన్నియో ఇబ్బందులు. తుదకు కొంత లంచమిచ్చి ఆ మార్గముననే పోవుటకు కెప్తాను నిశ్చయించెను.
బ్రాహ్మణుడు మొదట లంచము గ్రహించుటకు అంగీకరింపనట్లు నటించెను. తుదకు కెప్తాను బలవంతము పై దానిని స్వీకరించినట్లు గ్రహించెను.
ఈ రీతిగ బ్రాహ్మణుడు ఓడలను అన్నిటిని ఆపుచుండెను. కెప్తానులు లంచమిచ్చి పోవుటకు అలవాటు పడిరి. ఈ వ్యవహారము ప్రతినిత్యమును కొంతకాలము సాగినది. బ్రాహ్మణుని ఇల్లు అంతయును బంగారము ఐనది. అతని యింట లక్ష్మి తాండవించు చుండెను.
ఢిల్లీలో వెనుక భార్యతో ఆనాడు కలహించునపుడు "పాదుషా నాకు ఏడు రూపాయల ఉద్యోగము ఇచ్చిన నిన్ను ఏడు అంతస్తుల మేడలో నిలుపుదు" నని