ఒక మంత్రికి ఫకీరు కొలది కాలములో అశుభము జరుగును అని చెప్పెను. అతడు తోచక ఒక దిక్కునకు చూచెను. అతనికి అస్తమించు సూర్యుడు కన్పించెను. అతడు సూర్యాస్తమయమును గూర్చి ఇతరులకు చెప్పెను.
మంత్రులందరును అప్పటికి తెలివి తెచ్చుకొనిరి. సూర్యుడు అస్తమించెను. “ఇంటికి తిరిగిపోవుట మంచిది. సూర్యుడు అస్తమించిన వెనుక ప్రభువును దర్శించిన ఆయనకు కోపము వచ్చును" అని ఒక మంత్రి తన అభిప్రాయమును వెలిబుచ్చెను.
"కనుపింపక ఇంటికి తిరిగిపోయిన మరింత కోపము వచ్చును. ప్రభుదర్శనము చేసి క్షమాపణ వేడుట ఉచితము” అని మరియొక మంత్రి అభిప్రాయపడెను. తుదకు అందరును ప్రభువును దర్శించుటకే నిశ్చయించిరి. మంత్రులు ఉద్యానవనములో ప్రవేశించిరి. మహమ్మదు చక్రవర్తి ఆ వనములో ఒక మామిడిచెట్టు క్రింద అందమగు ఒక అరుగుపై సుఖముగ కూర్చుండెను. అతని ప్రక్కన అయాజ్ వినయముతో నిలువబడియుండెను. వారు ఇరువులు ఇష్టగోష్ఠిలో ఉండిరి.
ఆ దృశ్యమును చూచి మంత్రులు సిగ్గుతో తలవంచుకొని, చక్రవర్తి కడకు చేరిరి. చక్రవర్తి వారినిచూచి అభిప్రాయగర్భితముగ ఒక చిరునవ్వు నవ్వెను. ఆ నవ్వునకు అర్ధము ఏమో మంత్రులకు తెలిసినది. ఒక మంత్రి అయాజ్న చూచి "అమాత్యా! మీరు ఇక్కడికి ఏ దారిన వచ్చితిరి? రాజమార్గమున ఉన్న వింతలు చూడలేదా? వినోదములలో పాల్గొనలేదా?” అని ప్రశ్నించెను.
"వింతలా? నాకు ఏమియును కనబడలేదు. వినోదములతో నా కాలమును నేను ఎన్నడును వ్యర్థము చేయను. సూర్యోదయము ఐన వెంటనే ప్రభుదర్శనమునకు బయలుదేరితిని. సూటిగ నిటకు వచ్చితిని. ఉదయమునుండి నేను ప్రభువువారి సన్నిధినే ఉన్నాను" అని అయాజ్ సమాధానము చెప్పెను. అయాజ్ పలికినది అంతయు “సత్యము” అన్నట్లు చక్రవర్తి తల ఆడించెను.
మంత్రులు అందరి పక్షమున ఒక వృద్ధమంత్రి మహమ్మదు చక్రవర్తితో "ప్రభూ ! క్షమింపుడు. మన రాజమార్గమునందు ఉన్న వింతలు చూచుచు వినోదములలో