Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/884

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అడవిరాజు తన ప్రజలలో ఉన్న ధర్మబుద్ధికి మనస్సున సంతోషించుచు రెండవవానిని చూచి, "దీనికి నీవు ఏమైన చెప్పదలచితివా?" అని ప్రశ్నించెను.

రెండవవ్యక్తి అడవిరాజుతో ఇట్లు పలికెను. "ప్రభూ ! నేను ఇతనికి నా పొలమును అమ్మితిని. ఏనాడు అతడు నా యొద్ద విక్రయించుకొనెనో ఆనాడే అందలి నిధులు, నిక్షేపములు అన్నియు అతనివి. ఈ బంగారు నాణెములకుండ నాది ఎట్లగును? నాకు ఉన్నది నాకు చాలును. లేకున్న తమబోటి ధర్మప్రభువుల కొలువుచేసి బ్రతికెదను. పరులధనమును గ్రహించి పరలోకమున బాధలు పడజాలను. పరధనము నాకు వలదు. న్యాయము విచారించి తాము తీర్పునిండు.”

ఆ వ్యక్తులు ఇరువురు వినిపించిన తగవు అడవిరాజు శ్రద్ధతో వినెను. కొంతసేపు ఆలోచించి ఇట్లు తీర్పు చెప్పెను.

“సోదరులారా ! అతడు నేను పొలమును మాత్రమే కొంటిని. నిధి, నిక్షేపములు నావి కావు అని అనుచున్నాడు. నీవు పొలమును కొనిననాడే నిధినిక్షేపములు అతనివి ఐనవి. వానిపై నాకు హక్కు లేదు అని అనుచున్నావు. బాగున్నది. నా ఒక న్యాయము తోచుచున్నది. నీకు ఒక కుమార్తె ఉన్నది. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. వారిద్దరికి వివాహము చేయుడు. ఆ సమయమున ఈ భాండమును కాన్కగా వారికి ఇండు, మీ వివాదము తీరును.”

అడవిరాజు చేసిన నిర్ణయమునకు ఇరువురు వ్యక్తులును సంతోషించిరి. తమ బిడ్డలకు వివాహము చేయుటకు రాజు ఎదుట శపథము చేసి నమస్కరించి వెడలిపోయిరి.

అడవిరాజు చేసిన నిర్ణయమును చూచి అలెగ్జాండరు ఆశ్చర్యనిమగ్నుడయ్యెను. అతడు ఆశ్చర్యపడుట అడవిరాజు గమనించెను.

"ఓ మహారాజా! నా నిర్ణయమున అన్యాయము ఏమైన ఉన్నదా? ఏల ఆశ్చర్యపడుచున్నారు ? ఇట్టి తగవు వచ్చిన మీరు ఏ రీతిగ ధర్మనిర్ణయము చేసెదరు?" అని ప్రశ్నించెను.

అలెగ్జాండరు "సువర్ణభాండములు సామాన్యజనులవి కావు. అందుచే ఇది తగవుపడి వచ్చిన ఇరువురు వ్యక్తులకును చెందరాదు. మా దేశమున రాజులమైన మేము దీనిని స్వీకరింతుము” అని బదులు చెప్పెను.