పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/793

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలిపలుకు

వీర వనితలు, వీర మహాపురుషులు కర్తవ్యతా విమూఢములైన జాతుల నుద్ధరింప నావశ్యకములైన సమయములందవతరింతురు. కారణ జన్ములైన వారు కార్య సాధనానంతరము నిర్వాణ పథము నొందినను మృతజీవులై నిత్యమును జాతి నుజ్జీవింప జేయుదురు.

అట్టివారు గుణ గరిష్ఠులు, ఆదర్శమూర్తులు, ఇట్టి వీరుల జీవిత చరిత్ర పఠనము వలన నుత్తమ లక్షణములు, నున్నతా దర్శములు వ్యక్తుల కలవడి వారిని దివ్య జీవన మార్గముల నడిపించుననుట నిస్సంశయము.

ఝాన్సీ లక్ష్మీబాయి ప్రథమ భారత స్వాతంత్ర్య సమర నేతాజిని. తిలక్ మహాశయుడు ప్రప్రథమమున స్వరాజ్య శంఖారావ మొనర్చి పరదాస్య శృంఖలాబద్ధులై మ్రగ్గుచున్న సోదర భారతీయుల మేల్కొల్సిన వీర వైతాళికుడు. గాంధీజీ స్వాతంత్ర్యనౌక నహింసా సమర సాగరములందు సామర్థ్యముతో నడిపించి తీరమును చేర్చిన యద్వితీయ మహా నావికుడు. జీవిత సర్వస్వమును భారత దాస్య విమోచనా కృషి కర్పించి విదేశముల వసించు భారతీయుల సమైక్యమొనర్చి వారిని సంగ్రామ రంగమునకు పురోగామియై నడిపించిన యసమాన సమర నాయకుడు నేతాజీ.

వీరు నలువురును స్వాతంత్య్ర సమరయోధులు - అగ్రగాములు. వీరి జీవితా దర్శములను, కార్యసాధనారంగములను విజయ విశేషములను నిరూపించు గ్రంథమే నా ‘అగ్రగాములు’. ఈ వీరమూర్తుల జీవిత చారిత్రక ఘట్టములు పఠించి స్వతంత్ర భారత బాలబాలికలు దేశసేవా తత్పరతతో పురోగమింతురు గాక యని నా ఆకాంక్ష.

నన్నభిమానించి యీ గ్రంథమును వారి గ్రంథమాలలో నొక కుసుమముగ స్వీకరించి పాఠక లోకమున కర్పించిన ఓరియంట్ పబ్లిషింగ్ కంపెనీ యజమానులగు శ్రీ యం.ఎస్. శర్మగారికి నా కృతజ్ఞతా పూర్వక వందనములు.

- రచయిత