శాతకర్ణి సహజమైన ధైర్యమును గోల్పోలేదు. "మిత్రులారా! నేనీ శృంగమును నొంటరిగ దాటి యెవరినైన దెలిసిన వారి బిలచుకొనివత్తును. మనకు మరియొక మార్గము లేదు. జీఁకటి బడుచున్నట్లున్నది. వర్షమాగినను రాత్రి యీ పర్వత ప్రదేశముల నుండుట ప్రమాద'మని శాతకర్ణియనినాఁడు.
“నీవైన నట్టి సాహసమునకు బూనుకొనకుము. అది ప్రమాదకారి. శృంగమెంత యేటవాలుగ నున్నదో నీవు గమనించినట్లు లేదు”.
'లేకున్న మన మీరాత్రి గడచి బ్రతుకుట దుర్లభ'మని శిఖి దిగుట కారంభించినాడు. గుణస్వామి రోదింప నారంభించినాఁడు. "మిత్రుడా! నీ దుఃఖముతో నన్ను బంధింపవల’'దని వారించి మంగళునితో 'ధైర్యము కోలుపోకు'డని జెప్పి - శాతకర్ణి దిగిపోవనారంభించెను.
వర్షము కొంత వెనుకబట్టినది. కాని జీఁకటి తగ్గలేదు. సూర్యాస్తమయమై పోయినట్లున్నది. రెండు మూడు క్షణములైన తరువాత శాతకర్ణి భగవత్ప్రర్థనా గీతములు మిత్రులకు వినిపించుట లేదు.
సాహసముతో శాతకర్ణియొక మార్గమును బట్టి కొంతదూరము నడచి యొక మెలిక తిరిగినాడు. అతనికొక క్రమమైన మార్గము కనిపించినది. కొండ మొదటికిజేరి విచారింప నస్తమయమై ఘడియ దాటినదని తెలిసినది. వర్షమాగినది.
ఆ పర్వతపాద ప్రదేశమున నున్న గ్రామము జేరుకొని మొదటి గుమ్మము కడ నిలచి 'ఈ కొండపై నన్నిమార్గములతో బరిచయముగలవారెవర' రని బ్రశ్నించినాఁడు. ఆ యింటి యజమాని యతనికి 'పిండికుఁ'డను పర్వతకుని గృహమును జూపించెను.
పిండికుఁడు కంటకపర్వత శ్రేణులతో విశేష పరిచయముగల వాఁడు. పశు పాలకుఁడు. శాతకర్ణి కరుణకథ విని యతడు శిఖిమిత్రులను క్షేమముగ దింపి నాలంద మార్గమును జూపింతునని యభయమిచ్చెను.
“అయిన నాలస్య మొనర్పుకుము. నీ కష్టమును మేముంచుకొనము”.
"ఆ ప్రశ్న లేదు. విద్యార్థులు మీరు చిక్కుపడినారని కావలసిన సాధన సామగితో నతడు బయలుదేరినాడు. శాతకర్ణి దారిజూపింప పిండికుఁడతని ననుసరించినాడు. కొంత దూరము నడచిన తరువాత పిండికుఁడు దగ్గర దారిని జూచి శాతకర్ణి మిత్రులున్నచోటకి నడిపించు చున్నాఁడు.
"శిఖీ! శిఖీ!" యను కేకలు వినిపించినవి.