'బాగున్నది! జంఝామారుతముగనున్నది!! ప్రగతికి జై! శిఖిశాతకర్ణికి జై!' అను నినాదములతో విద్యార్థులు కేకలు పెట్టినారు. గయాశీర్హుడు చైత్యగృహమున నుండుటను గమనించి విద్యామందిరమునకు వారు బయనమైనారు.
కాషాయ వస్త్రముతో జుట్టిపెట్టిన తాళపత్ర గ్రంథములనన్నిటిని నేలపై గ్రుమ్మరించి నిప్పంటించినారు.
'ఇది మనకందరకు బ్రమాదము. మీరు నిప్పుదొక్కిన కోతులవలె ప్రవర్తించుచున్నారని సునేత్రుడనిన మాటనెవ్వరును పాటింపలేదు.
ధ్వజకేతు 'శిఖీ! మన 'శిక్షణ పత్రికలు' కావు. ఆచార్యుని 'పారమిత గ్రంథము' అనినాడు. వానినెట వెదకి దహింపగలము. అన్నిటి రూపుమాపిన నవియును నశించు'నని శాతకర్ణి శివమెత్తినట్లు తాళపత్రముల దహించుచు సమాధానము జెప్పినాడు.
అన్నిమూలల వెదకివెదకి గ్రంథజాలములకు నిప్పంటించినారు. అవి సమస్తమును స్వల్పకాలమున భస్మరాసులై రూపుమాసి పోయినవి.
వారి యుద్రేకము చల్లారినది. భయోత్పాత మారంభించినది. ఎవరికివారెట్లు తప్పించుకొనుటయా యని యాలోచింపసాగినారు. 'నూతన విద్యార్థి శాతకర్ణి గయాశీర్షుని గ్రంథజాలమును భస్మమొనర్చినాడని నాలంద నలుదెసల ననతికాలములో దెలిసిపోయినది.
ఎటుజూచిన నదియే సంభాషణ. కాని విద్యార్థులెవ్వరు నుపాధ్యాయులకు గాని’ యాచార్యులకుగాని యా వార్తను తెలియపరచలేదు.
"శిఖిశాతకర్ణి కిక నాలందలో విద్యార్జన మొనర్పతావుండునా ?" యనునదియే ప్రతి విద్యార్థి హృదయమును గలవరపెట్టుచున్న ప్రశ్న.
మరుసటిదిన ముదయము, భోజనాంతరము విద్యార్థులెవరి కక్ష్యలో వారు ప్రవేశించినారు. విద్యార్థులలో 'నుప్పిడి చప్పిడి' లేదు. గయాశీర్షుడు యథాక్రమముగ జేత పేపబెత్తములు కట్టతో ప్రవేశించినాడు. ముందొక భస్మరాశి కనుపించినది.
'ఈ పని చేసినదెవరు?' అని ప్రశ్నించినాడు. సమాధానము రాలేదు. ఆయన దృష్టి మరియెక వంకకు బ్రసరించినది. ఆట మరియొక భస్మరాశిలో సగము తగులబడిన