పర్యవేక్షణ క్రింద నొక కక్ష్యలో విద్యామందిరమున మరికొందరు విద్యార్థులతో గలసి విద్యనేర్చు కొనవలెను. పదిమంది విద్యార్థులతో నొక నివాసగృహకక్ష్యలోవసించి నిద్రింపవలెను. అయిన నతడింతకు బూర్వమిట్టి విద్యకు గాని, నివాసమునకుగాని యలవాటు పడినవాడు కాడు.
'ఆచార్యపాదులు నిన్ను బరీక్షించినారా?'
'లేదు! శీలభద్రులు నన్నేమేమి జదువుకొనినావని యడిగినారు. నా సమాధానములు విని కాశ్యపుల గలిసికొని వారియొద్ద విద్య నభ్యసింపుమని యాదేశించినారు'.
'కాశ్యపుడా!' యని ధ్వజకేతువు ముఖము చిట్లించినాడు. 'వా రెటువంటివా'రని శాతకర్ణి ప్రశ్నింప “ఆయన మనిషికాడు. కేవలమొక యంత్రము. నేనును మొదట కొంతకాలము వారికడ జదివినాను. అప్పుడు నా జాతకమున శని బాగుండలేదని పించిన దని ధ్వజకేతువు వ్యంగ్యముగ బలికినాడు.
“ఛీ! నోరుమూసుకొనుము. ఆచార్యపాదుల గుఱించి యవ్యక్తముగ మాటాడుట యనుచితమని యతని సంభాషణమును మాన్పించి మంగళుడు శాతకర్ణితో నిట్లనినాడు.
"మిత్రుడా! తినబోవుచు రుచి యడుగనేల? వారి సద్గుణములు స్వల్పకాలములోనే నిన్నాకర్షించునని నా విశ్వాసము. నీయుపాధ్యాయు లెవరు?"
"గయాశీర్షులు.”
మరల కల్పించుకొని ధ్వజకేతువు 'గయా శీర్షులా?' యని యాశ్చర్యమును వెలిబుచ్చి నాలుక కొఱికినాడు. బాగున్నది. ఇరువురు మహాత్ములును తగ్గవారు దొఱకినారు అనినాడు.
“వారి స్వభావమెట్టి?”దని శిఖి శాతకర్ణి మంగళుని బ్రశ్నించినాడు.
“నీవు వినయవిధేయతలతో సక్రమముగా ప్రవర్తించి సకాలమునకు బారముల వల్లించిన నాయన నీజోలికి రాడు. నిన్నుదయతో బాలించును. ఆయనకు మాంద్యము గిట్టదు: చిలిపి తనము సహింపలేడు. అట్టి విద్యార్థులతో మాటాడుటకైన నిష్టపడడు అసహ్యించుకొనును" అని మంగళుడు గయాశీర్షుని స్వభావమును విశదపరచినాడు.
"అడుగో! ఆ మట్టిచెట్టు నీడలో 'పృథువుల'తో మాటాడుచున్న వ్యక్తి గయాశీర్షుడు”అని ధ్వజకేతువు నూతన మిత్రుని కతని యుపాధ్యాయుని జూపించినాడు. శిఖి యాయనను గుర్తు పెట్టుకొనినాడు.