Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/707

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలిపలుకు

ఆదర్శ విద్యార్థి జీవితకథను వస్తువుగా గ్రహించి నవలా రూపమున పుట్టిన గ్రంథము లాంధ్రభాషలో నవరూపములుగనున్నవి. 'నాలంద' యట్టి యత్నములలో నొకటి. శిఖిశాతకర్ణియను నుత్తమ విద్యార్థి జీవితమిందు చిత్రితము.

ప్రాచీన భారతదేశమున 'నాలంద' యుత్తమ విశ్వవిద్యాలయముగ ప్రఖ్యాతి గడించుకొనినది. ఆ విశ్వవిద్యాలయ వాతావరణమును స్వీకరించి యుత్తమ విద్యార్థి జీవిత కథాకల్పన మీ 'నాలంద'లో నొనర్పయత్నించితిని. క్షమాది యుత్తమగుణ ప్రభావమువలన విద్యార్థులెట్లుపాధ్యాయులకు వశ్యులై వారి యాదరానురాగములతో ఉత్తమ వ్యక్తులుగ పరిణమించి విద్యాస్వీకరణమొనర్చిన సంస్థను క్రమశిక్షణము వలనను, నున్నత నీతివలనను జగత్ప్రసిద్ధము కావింప సమర్థులగుదురో యీ యాఖ్యాయిక యందు నిరూపితమైనది.

ఈ కథారచనమున కావశ్యకములైన చరిత్రాంశములను సాంక్లియా మహాశయుని 'నాలంద విశ్వవిద్యాలయ'మను పరిశోధన గ్రంథమునుండి నేను స్వీకరించితిని. ఫారార్ మహాశయుని 'సెయింట్విని ఫ్రేడ్సు' బృహత్కథాపఠనము నా యాఖ్యాయికారచన కుద్బోధకము.

ఈ నవలను వారి గ్రంథమాలలో నొక కుసుమముగ గైకొని నన్నభిమానించి ముద్రణాస్థితిని గల్పించిన ఓరియంట్ పబ్లిషింగ్ కంపెనీ యజమానులగు శ్రీ యం.యస్. శర్మగారికి నేను సర్వదాకృతజ్ఞుడను.

రచయిత