లోకం నన్ను మహాపాపి అని చరిత్రల్లో వ్రాసుకొని చదువుకుంటుంది కాబోలు! అబ్బా! ఆ వ్రాతలు నా ఆత్మ ఎలా వినగలుగుతుంది తండ్రీ! భరించలేను. నా హృదయ సౌశీల్యం నీ వొక్కడికి తప్ప మరెవ్వరికీ తెలియదు కదా!
ప్రసవము నాయెడంద, మధుపాత్రల కోర్కెలు తీర్చలేదు, ఈ
కుసుమ సుగంధ చాలనలకున్ జగమెంత ప్రతీక్ష చేసెనో
పసదన మిచ్చి తృప్తి పరుపన్ తరిగాదు ఉమామహేశ! ఈ
ప్రసవము కాంక్షచేసి విషవాసనలన్ ప్రసవింప పూనుటన్
లోకానికి బహిర్గతం కాకపోతే విచారించను. ఇది నీ హృదయంలో హత్తుకుంటే చాలు జగద్రక్షకా! జగచ్చక్షూ!! విశ్వవ్యాపీ!! మహా దేవా!!!
తండ్రీ! నీ రక్త దాహం చల్లారిందా? చల్లారకపోతే మిగిలినది తీరుస్తాను. పారిపోయే సైన్యాలను ఆపి బ్రహ్మన్న మీద పడతాను. అతడినీ అతడి రాజకులాన్నీ అంత మొందించిగాని మరీ మృత్యువు వాతపడను. రౌరవాది నరకాలల్లో అనేక జన్మలు ఆవాసం చెయ్యవలసి వచ్చినా వెనుదీయను. ఇది తథ్యం. తండ్రీ!
స్ఫాయద్భీరక మంద్రగర్జ విపులాశా గర్భ నిర్భేదమై
మ్రోయన్, శాతశిలీముఖ ప్రకర సంబుద్ధేద్మ విద్యుద్యుతుల్
కాయన్ సంగర వీథిరక్త జలదాకారమ్ముతో శత్రురా
టాయంబుల్ రుధిరాప్లుతంబులుగ రక్తాంబోధి వర్షించెదన్.
(నాగులేరు పొంగులు వారుతూ ప్రవహిస్తూ ఉంటుంది. చెల్లాచెదరై పారిపోతూ ఉన్న సైన్యాన్ని ఆపుచేసి నాగమ్మ ఉద్బోధ గీతం పాడుతుంది)
పొంగవే, పొంగవే ఓ నాగులేరా!
ఉప్పొంగి పొంగించు మా వీరహృదయాల
రుధిరారుణ ప్రభల
లోకాల ముంచెత్తి
ప్రళయకాల మహోగ్ర
భయద హేషార్భటుల - పొంగవే
పాతాళ లోకాల
పగిలించి పెకిలించి
గగనముల చుంబించి
———————————————————
వావిలాల సోమయాజులు సాహిత్యం-2