బ్రహ్మన్న మహామంత్రి రాజ్యమేలించాలి. ప్రజ సుఖించాలి ఇదే నా ఆశయం... (కత్తివైపు వెర్రిగా చూచి ఆత్మహత్యకోసం మెడమీద సారించి జయ్ మహాదేవా మళ్లీ వెనుకకు లాగుకొని)
పాప మొనర్చితిన్, పరమబంధుల కానల పాలు చేసి పరి
తాపము నిచ్చితిన్, రుధిరధారల ముంచితి పుణ్యభూమి నే
నోపగ రాని దుఃఖముల నొంచితి భూప్రజ - వెర్రికీ
పాపికి తావు లేదిల కృపాణమ జాలి వహింప నేటికే
నాగమ్మా (ఏహ్యకంఠంతో) మహామంత్రిణీ! నీవు ఆ కడజాతి కన్నమదాసు కత్తికి ఆహారమైతే చూచి ఆనందించి గాని ఆత్మహత్య చేసుకోను. హంతకీ! ద్రోహీ!! నాగమ్మా ! పాపినీ! చండాలినీ.
(ఒరనుండి లాగిన కత్తితో నాగమ్మ ప్రవేశిస్తుంది)
నాగమ్మ: ప్రభూ ఏమిటీ ఉన్మాదం?
నలగామ: (కోపంతో) ఆఁ. ఉన్మాదమా! జాగ్రత్తగా మాట్లాడు.
నాగమ్మ: మీలో ఈ మార్పుకు కారణం?
నలగామ: (నిష్కర్షగా) నీ ద్రోహము.
నాగమ్మ: (వికటంగా నవ్వి) నా ద్రోహమా! 'పాపినీ' 'చండాలినీ' ఇన్నాళ్ళు మీ సేవ చేసినందుకు మంచి బిరుదులు ప్రసాదించారు. పోనీయండి. పైన పరమశివుడే ఉన్నాడు. కనిపెట్టటానికి.
నలగామ: (వికృత కంఠంతో) కనిపెట్టడూ? ఇప్పటికే చాలా బాగా కనిపెట్టాడు. నాకు నీవు సేవ చేశావు కదూ. రాక్షసీ! నీ చెప్పుచేతల్లో పెట్టుకొని సేవ చేయించు కున్నావు. నా రాజ్యపాలనా కాంక్షను వృద్ధిచేసి దేశానికి తీరని ఉపద్రవం తెచ్చిపెట్టావు. నీ కోరికలన్నీ ఫలించినవి. నన్ను చంపించావు. నరసింహుణ్ణి పలనాటి రాజ్య సింహాసన మెక్కించావు. ఇక నువ్వు మర్యాదగా మరణించవచ్చు. దేశ మికనైనా బాగుపడుతుంది.
(సైన్యాలు పారిపోతూ ఉన్న కలకలం వినిపిస్తుంది)
—————————————————————————
వావిలాల సోమయాజులు సాహిత్యం-2