Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాలచంద్రుడు : అన్నా! మనం యువకులం. భావి రాజ్య భారం మన బాహువుల మీద పడుతుంది. మేలుకోవలసింది మనం. ఈ బాలుడిక ఆగలేడు. బలంతో ముందు దూకబోతున్నాడు.

బ్రహ్మన్న : యువక జనోత్సాహానికి అడ్డు చెప్పటం అంత మంచిది కాదేమో కేతరాజూ!

కన్నమ : (త్వరగా ప్రక్కకు నడచి) వీరాగ్రేసరులారా! ఇక వీరవసంతం చల్లుకోండి. వీరపూజలు చెయ్యండి. కడుపు నిండా కల్లుకుండలు నింపండి. శక్తి జాతరలు చేసుకోండి.

(ముందుకు నడుస్తూ నిష్క్రమిస్తాడు)

బ్రహ్మన్న : తండ్రీ, కేతరాజూ! ఇక నిష్ప్రయోజనం! కల్లుకట్టలు తెగిపోతున్నవి. ఈ కడలిని బ్రహ్మన్న బాహువు లొడ్డి ఆపలేడు. సుపవిత్రమైన యీ పలనాటిసీమ... రక్తపు వరదకు గురికావలసిందే... కొన్ని వత్సరాలు పిశాచాలు పండవలసిందే.

కేతరాజు : అయితే ఇక బయలుదేరుతాను... సెలవా?

బ్రహ్మన్న : అవశ్యము నాయనా... భగవదనుగ్రహం ఎలా వుందో!

(దారి చూపిస్తాడు. కోటకేతరాజు నిష్క్రమిస్తాడు)

బాలచంద్రుడు : తండ్రీ! నాకు సెలవా?

బ్రహ్మన్న : నాయనా! యుద్ధరంగంలో దూకబోతున్నావు. నేను మటుకు కత్తి పట్టను.


భ్రమతో నేగుచునుంటివో రణమునన్ పాండిత్యమే యున్నదో,
సమరోదగ్రులు శాత్రవుల్ కరుణకున్ స్థానమ్ము శూన్యమ్ము, స
ర్వము కాలానల భైరవ ప్రళయ మోర్వంజాలినన్ పొమ్మునే
నమరుల్ సాక్షిగ కత్తిపట్టను, విజయైకాంక్ష నో బాలుడా


బాలచంద్రుడు : పేరు బాలుడే కాని బిరుదు మగణ్ణితండ్రీ! మీరు కత్తి పట్టడం ఎందుకు భవిష్యద్భారాన్ని మోయవలసిన మీ యువక లోకాన్నే పరదళాల మీదికి పంతం తీర్చటానికి పంపండి. ఈ బాలుడు చిల్లర దళాల మీద చెయ్యి చేసుకోడు.

బ్రహ్మన్న : (బుజం తడుతూ) అనేక యుద్ధాలల్లో ఎదురు నిలవలేక చిక్కి చెప్పినట్లు శిరసాడించిన రాజులందరూ పగర పక్షంలో బారులు తీర్చారు. జాగ్రత్త!


80

వావిలాల సోమయాజులు సాహిత్యం-2