రజియాబేగం: సోదరా! నీకు మాత్రం అంత పట్టుదల ఎందుకు? నీ వంశాన్ని నాశనం చేస్తున్నానని నీ బీబీల చేత నన్నెందుకు తిట్టిస్తావు. శివాజీపని పట్టడానికి మరో వీరుణ్ణి పంపిద్దాము.
అప్జల్‌ఖాన్: సోదరీ! రజియా! ఆఫ్‌ఘన్ పుట్టుక పుట్టి, అనేక యుద్ధాలు చూసి, నా చేత అనేక యుద్ధాలు చేయించిన నీవే ఇలా మాట్లాడుతావను కోలేదు. నా శక్తి మీద నీకు నమ్మకం లేదా?
రజియా: లేక కాదు. శత్రువు అంత సామాన్యుడు కాడని.
అఫ్జల్‌ఖాన్: ఏమిటి? ఆహవం అంటే ఏమిటో ఎరక్క అరణ్యాల మధ్య పెరిగిన ఆ ఆటవికుడు శివాజీ ఒక వీరుడనేనా? అతడు నాకంటే బలవంతుడనా నీ అభిప్రాయం?
రజియా: నిత్యమూ మన చారులు తెచ్చే వార్తలు వింటుంటే అలాగే అనిపిస్తున్నది.
అఫ్జల్‌ఖాన్: అయితే నేను అతణ్ణి తప్పక ఎదురించి తీరుతాను.
కృష్ణజీ: అక్కగారు చెబుతున్నా మీరు అంత గట్టి పట్టు పట్టటం అట్టే బాగాలేదు.
రజియా: చిక్కించుకొని పులిని అతడు చేతులతో చీల్చి వేస్తాడట! అతడికి నీవో లెక్కా? నీ ఉబలాటం మానేయ్.
అఫ్జల్‌ఖాన్: అది మానేయటమంటే మరి నన్ను నేను హత్య చేసుకోవటానికి నీవు అంగీకరిస్తావా?
రజియా: అయితే నీవు అతణ్ణి మోసం చేసి ఎదుర్కోటానికి ఒప్పుకుంటే నీవే అతని మీదికి వెళ్ళటానికి ఒప్పుకుంటాను.
అఫ్జల్‌ఖాన్: సాటి వీరుణ్ణి మోసగించటమా... పోనీ, అలానైనా ఒక మారు అతడితో పోరాడే అవకాశం లభిస్తుంది. సరే మోసగించటానికి ఒప్పుకుంటాను. ఇక ముందు జరగవలసింది.
రజియా: కృష్ణజీ! ఏమంటారు?
కృష్ణజీ: బాగుంది. మోసాన్ని తలపెట్టకుండా ఆ మహారాష్ట్ర సింహాన్ని పట్టుకోవటం సాధ్యమైన పని కాదనే నా అభిప్రాయం.
458
వావిలాల సోమయాజులు సాహిత్యం-2