కజ్జల : సహజ ధర్మం కాబట్టే విప్లవం. నేను సహజ ధర్మాలకు లొంగలేదు. ఎదుర్కొనలేని సామాన్య జనాన్ని జరామరణా లకు స్వాగతమిచ్చి ఆహ్వానించనీ - నేను మాత్రం జయించటానికి ప్రయత్నించవలసిందే.
సారంగదేవి : అమ్మా! ఈ ప్రపంచ పరిణామంలో ఏదీ స్థిరమైంది కాదు. సమస్త వస్తువూ నశించేదే - అలాగే వృద్ధాప్యం కూడా.
కజ్జల : అమ్మాయీ! నీవు చెప్పేది నాకేదీ తలకెక్కదు. నేను అదంతా నమ్మలేను.
సారంగదేవి : నమ్మనంత మాత్రంలో అవేవి సత్యాలు కాకపోవు.
కజ్జల : భగవంతుడు కూడా సత్యమేనా?
సారంగదేవి : భగవంతుడుంటే ఏమిటో గ్రహించే స్థితికి వచ్చిన తరువాత సత్యమే -
కజ్జల : నా అభిప్రాయమేమిటో చెప్పమన్నావా? భగవంతుడనే ఒక నపుంసకుణ్ణి సృజించి యీ ప్రవక్తలందరూ లోకాన్ని మోసపుచ్చుతున్నారు. మభ్య పెడుతున్నారు. నా దృష్టిలో అతడు ఎంతో నీచుడు. హృదయం లేని జంతువు! అమాయకమైన ప్రాణాలకు దేహం కల్పించి అవి జీవయాత్రలో అల్లట తల్లటై పోతుంటే చూచి లీలగా ఆనందిస్తాడట! ఎంత అభూత కల్పన! సౌందర్యమంటే ఎరగని ఆ రసికుడు ప్రపంచంలో ఎన్నెన్ని ఏహ్య వస్తువులు సృజించాడు. యౌవనాన్ని సృజించిన చేతులతోనే వృద్ధాప్యాన్ని ఎలా సృష్టించాడు. సుందర మూర్తులను ఊహించిన మేధాశక్తితో అందవికారుల రూపకల్పన మెలా చేయగలిగాడు. ఆ భగవంతుడు ప్రేమ ఎరుగని పీనుగ. కేవలం సృష్టిలో కదల మెదల లేని భయంకర జడవస్తు సమూహంలాగానే అతనూ ఒక అవ్యక్త, అద్వైత, అనంత, జడపదార్థం. అంతేనా?
సారంగదేవి : అమ్మా! నీ మాటలు నా గుండెలు బ్రద్దలు చేస్తున్నవి. (తల్లి నోరు చేత్తో మూయబోతుంది)
కజ్జల : (వారిస్తూ చిరునవ్వుతో) అమ్మాయీ! నీ యౌవనరూపం ఎంత నయనానంద కరంగా ఉంది. నేనే అనుభవిస్తే...
సారంగదేవి : అమ్మా! నిన్ను చూస్తుంటే నాకేదో భయం వేస్తున్నది. అలా ఆకలిడేగ కళ్ళతో నన్ను చూచి భయపెట్టకు. నామీద కలిగే ఈర్ష్యకు మనస్సులో స్థానం కల్పించకు
ఏకాంకికలు
397