రాణి : మహారాజు రాత్రి నన్ను అడిగి పుచ్చుకొని వెళ్ళారు. నీకోసమే ననుకున్నాను కజ్జలా! ఎంత సంతోషంతో తీసి ఇచ్చానను కున్నావు. అయితే ఆ కానుక నీకు కాదన్నమాట. ఇంకెవరికిచ్చి ఉంటారబ్బా (యోచన) ఉఁః... నమ్మలేను. ఉఁ నమ్మలేను.
కజ్జల : వారి మెడలోనే ఉండి ఉండవచ్చు. వచ్చి కొడుకును ముద్దాడి నా కంఠసీమను అలంకరించవచ్చు.
రాణి : ఆ కంఠసీమను అలంకరించటం గత రాత్రే జరిగిపోయినది. నీ కంఠసీమను కాదని ఇప్పుడు నాకు అవగతమౌతున్నది. - మీరిచ్చిన బహూకృతికి ప్రియ సంతోషించిందా అని ప్రశ్నిస్తే మహానందపడ్డదని ప్రభువు సమాధానం చెప్పి నప్పుడు నాకెంత ఆహ్లాదం కలిగింది కజ్జలా! నీవంటే నాకు మొదటినుంచీ అదేదో అర్థంకాని అనురాగమూ, అనుబంధమూ ఏర్పడ్డవి... పోనీలే దిగులు పడవద్దు. నేను ప్రత్యేకంగా నీకివ్వమని మరొక పతకం - అంతకంటే చాలా విలువగలది - మా తండ్రిగారు నాకు వివాహ సమయంలో బహూకరించింది - ప్రభువుచేత పంపిస్తాను దిగులు పడకు.
కజ్జల : నాకేమీ అవసరం లేదు.
రాణి : నేను తప్పకుండా పంపిస్తాను. నీవు ఇంత చిన్నబుచ్చు కోవటం వల్ల నా మనస్సుకు ఎంత బాధగా ఉన్నదో నీకేం తెలుసు... ఉఁ ఇంతకూ మహారాజు నిన్ను మోసగించారన్న మాట - ఇక బయలుదేరనా... వెంటనే పతకం పంపిస్తాను. (లేవబోతుంది)
కజ్జల : (యోచనాపూర్వకంగా) దేవీ - మీరు పంపవద్దు. నాకు అనవసరం. ముమ్మాటికీ నేను స్వీకరించను.
రాణి : స్వీకరించవూ? ఏమిటా కలవరము కజ్జలా? ఈ దినము ప్రతి చిన్న విషయమూ నిన్నింతగా కలతపెడుతూ ఉన్నదేం? పోనీ. పంపనులే. నీ మనస్సుకు అంత కష్టంగా ఉంటే నేనుమాత్రం బలవంతం చేస్తానా. ఎందుకీ బాధ పడటం. ఏం ప్రయోజనం. మహారాజు చిత్తవృత్తి ఎరుగని దానివి కావుగా... ఆయన ఎప్పుడూ కొత్త కొత్త సీతాకోక చిలుకలను వెతుకుతూ ఉంటాడుగదా. నూతన ప్రియుడు ఈ పతాకాన్ని తన్నుకుపోను పరసీమనుంచి ఏదో ఒక సీతాకోకచిలుక మన రాజు సౌధాగ్రం మీద వ్రాలిందన్నమాట.
కజ్జల: (దీర్ఘ నిశ్వాసంతో) దేవీ నేను అలసి పోయినాను. క్షమించాలి.
382
వావిలాల సోమయాజులు సాహిత్యం-2