Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నరసింహ : ఆ గోవులు మీ వెందు కౌతవి? కాజేసుకోపోయిన చంద్రాయుధం అమ్మి కొన్నారు. అది మా తండ్రిగారిది. అందువల్ల ఆవులు మావే.

అలరాజు : (నలగామరాజు వైపు చూస్తూ) అంతేనా?

నలగామ: (పెడమొగంగా) ఔను.

అలరాజు : (ఆసనం మీది నుంచి లేచి) ఇక శాంతి వహించలేను. మీ అక్రమం మించి పోతున్నది. నేనే మీమీద యుద్ధం ప్రకటిస్తున్నాను. మామా! నీ రాజ్యం ఇక నిలవదు. నీవీ నాగమ్మ చేతిలో ఇంకా ఎన్నాళ్ళు ఆటబొమ్మవైపోతావు? ఎన్నెన్ని ఘోరకృత్యాలు చేస్తావు? పుల్లరి మీ కివ్వమని మాచర్ల సీమ ప్రజలు తెలియపరచుకుంటే నాగమ్మ గుర్రపు దళాన్ని పంపించి ప్రజను తొక్కించిందట! మాచర్ల సీమ అట్టుడికి పోతున్నది. ఆమె ఇప్పటికైనా బ్రహ్మన్న మంత్రులవారి పాదం పట్టుకొని క్షమాభిక్ష వేడుకోకపోతే విప్లవాగ్ని జ్వాలలు ప్రజ్వరిల్లి ప్రభుత్వ వనాలను దహించి వేయక మానవు. ఇవి నా మాటలు కావు. బ్రహ్మన్నమంత్రులవారి ధర్మ పుత్రుడు కడజాతి కన్నమ దాసు చెప్పమని చెప్పిన మాటలు. మీ దురాగతాలను దేశం ఇక భరించలేదు.

నాగమ్మ : (కోపంతో) ప్రభూ! ఇది దౌష్ట్యం.

అలరాజు : దౌష్ట్యం నాదా? దుష్టంగా ప్రజాపాలన చేయించే నీది దౌష్ట్యం చేసే రాజుది దౌష్ట్యం.

నలగామ: (కొద్ది కోపంతో రూక్షంగా చూస్తూ) అలరాజూ! మితిమీరవద్దు.

అలరాజు : మితిమీరక తప్పదు. కడుపు కలచేసే భయంకర కృత్యాలు తలపుకు వస్తుంటే మితిమీరక ఉండటం ఎట్లా?

నలగామ : అయితే నీ ఇష్టం వచ్చినట్లు పేలు. యుద్ధానికే నేను సిద్ధ పడ్డాడని వారితో చెప్పు.


బెదరెడు వాడె వీడు వెరపింపగ బాలుని సంధి పేరిటన్
పదరగ పంపినారు నిను భ్రాతలె బంధువులే తలంప నా
మదిగల ప్రేమ తీరినది మాటలతో పనిలేదు చెప్పు మా
కదనమె నిశ్చయమ్ము - నలగామ నృపాలుడు జోదుకాదుకో


(అతివేగంగా నిష్క్రమిస్తాడు)


34

వావిలాల సోమయాజులు సాహిత్యం-2