Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాచీ : (సిగ్గాపుకొని) పంతూ! నీ కేమన్నా కావాలా యేమిటి? రోజుటి మాదిరిగా పిలిచి అడగటం లేదు.

కృష్ణపంతు : రోజూ ఏమని పిలిచేవాణ్ణి.

నాచీ : చెల్లీ! అని. రాత్రి నాన్నగారు నీకు 'గీత గోవిందం' పాఠం చెపుతూ వుంటే నేనే రాధికనై పోయి గేయం వ్రాశాను.

కృష్ణపంతు : చెల్లీ! ఏదీ ఆ గేయం.

నాచీ : నేను రాధికనై పోయానంటే! కృష్ణ! నీవు చెల్లీ అంటే మనసెలా వుంటుంది? చదవమంటావా?

కృష్ణపంతు : చదువు.

నాచీ : (గొంతుక సవరించుకొని)


నా వలపు పూవీథి
నవనళినివై నీవు
నటనాలు సల్పరా
నందగోపాలకా!
మెరుగు తీగలు పూయు
మిసిమి పూదామమును
అంతరాంతరములో
అంబు ముత్యములతో
కూర్చి నీ మెడవేసి
కులుకుచున్ బాడెదన్ ॥నా వలపు॥


(అని చక్రభ్రమణము)

కృష్ణపంతు : (సంతోషం లేనట్లు నటిస్తాడు నాచీ చూస్తే)

నాచీ : నీకిష్టం లేనట్లుంది, ఆపివేయమంటావా?

కృష్ణపంతు : (మాట్లాడడు)

నాచీ : (ధైర్యంగా) ముందేదో నీకూ నాకూ బాంధవ్యం కలపాలని అమ్మా నాన్నా నిన్ననే అనుకుంటే విన్నాను. నీకు కూడా తెలిసిందిగామాలి. అందుకోసమనా ఏమిటి మాట్లాడటం లేదు?


ఏకాంకికలు

311