నరసింహ : ఒక కత్తినే ఉంచాలి. ఏ కత్తిని -
నాగమ్మ : ఈ కత్తినే (ఒక దానిని చూపిస్తుంది) ఈ ఒర రాజ్యం. ఈ కత్తి నరసింహ రాజులుంగారు. ఆ కత్తి నలగామరాజులుంగారు.
నరసింహ : (సంతోషంతో) ధన్యుణ్ణి. మహామంత్రిణీ! మీకు సర్వదా కృతజ్ఞుణ్ణి.
తెలిసెను కొంత కొంతగ మదింగల మీ కృప ఎల్లవేళలన్
తలుపుడు చిత్తమందు నను, దాసుడు మీకెపుడెట్టి కార్యముల్
కలిగిన తీర్పగాగలడు, గర్వమెదింకను మిమ్ము కొల్చుటల్
కలుగుటె యెంచ భాగ్యమది, కాడు కృతఘ్నుడు వీడు మీయెడన్
(రెండు ఆబోతుల రంకెలూ జనకోలాహలమూ వినిపిస్తుంటవి)
నాగమ్మ : ఏమిటా రంకెలూ, కోలాహలమూ?
నరసింహ : (లేచి వాతాయనం వైపు నడిచి చూస్తూ)
రెండు ఆబోతులు హోరాహోరీగా కొట్లాడుతున్నవి.
నాగమ్మ : ఎవ్వరూ ఆపటానికి ప్రయత్నించటం లేదా?
నరసింహ : బలవంతుడు మధ్యకు -
నాగమ్మ : వాడు అయిపోయినాడా? లేదా?
(ఆబోతులు పెద్ద పెట్టుగా రంకెలు వేస్తుంటవి. ఒక వ్యక్తి మరణ వేదనతో 'హా' అని ధ్వని చేస్తాడు.)
నరసింహ : మీరు సెలవిచ్చినట్లే జరిగింది.
నాగమ్మ : జరక్క తప్పదు. జరగ వలసినదీ అంతే. ఇది నా మాట కాదు, మహాదేవుడి మాట.
నరసింహ : ఏమని?
నాగమ్మ : బలం గల రెండు పక్షాలు వివాదానికి దిగినప్పుడు అనవసరంగా జోక్యం కలిగించుకున్న వాళ్ళకు ప్రాణహరణము తప్పదని.
28
వావిలాల సోమయాజులు సాహిత్యం-2