Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జయ : అందుకే గామాలి, మీరు మహజాగ్రత్తగా గోడమీద పిల్లివాటంగా మాట్లాడి తప్పించుకుంటుంటారు - నాకు అలా వేషాలు వేయటం చేతగాదు.

పుణ్యకోటి : అయితే ఆ ఉపన్యాసం మనస్ఫూర్తిగా ఇచ్చిందన్నమాట!

జయ : ఔను, మహాత్ముని నిర్మాణ కార్యక్రమానికి నాచేతనైనంతగా తోడ్పడదామని నిశ్చయించుకొన్నాను. ఇంకా ఈ పాశ్చాత్య వ్యామోహపిశాచం మన్నెంత కాలం పట్టి బాధించటం!

పుణ్యకోటి : మీ నాన్నగారి అధ్యక్షతక్రింద మేము చేస్తున్నదేమని నీ అభిప్రాయం?

జయ : కాగితాలమీద తీర్మానాలు, ఇష్టం వచ్చిన వాళ్ళను నాయకులను చేసి సన్మానాలూ, పైకి తంతితపాలాలూ, మీలో ఒక్కరికీ హృదయమున్నట్లు నాకు కనుపించటంలేదు.

పుణ్యకోటి : అయితే మావల్ల మహాత్మునికి అపకీర్తేనని నీ నమ్మకమా?

జయ : నిశ్చయంగా. మాటలు చూడబోతే సేవా, త్యాగము, స్వేచ్ఛ, సౌఖ్యము, సర్వసమత్వము, అభ్యున్నతి, జాతీయత, అంతర్జాతీయత.

పుణ్యకోటి : (పెద్దపెట్టున నవ్వుతూ) జయా! వృథాగా ఈ కోపం ఎవరిమీద?

జయ : దేశద్రోహులమీద. అజ్ఞానాంధకారంలో అల్లటతల్లటౌతూ నిత్యయాత్రకు యాతనపడుతూ ఉన్న సామాన్య మానవుడి పేరు చెబుతూ ముందు ప్రాపకం, తరువాత డబ్బు సంపాదించుకొనే పాషండులమీద - ప్రజాసేవ పేరుచెప్పి సమితి ఏమి చేసిందో చెప్పండి.

పుణ్యకోటి : అలా అడుగు - సమితి లేకపోతే మద్యపానం నిషేధం అమలులోకి వచ్చేదే కాదు.

జయ : (వికటంగా) మద్యపానాన్ని నిర్మూలించారు.

పుణ్యకోటి : హరిజన దేవాలయ ప్రవేశం

జయ : గృహప్రవేశానికి మనస్ఫూర్తిగా అంగీకరించని మనం దేవాలయ ప్రవేశం చేయించాము.

పుణ్యకోటి : సంఘంలో ప్రచారం మూలాన అనేక విషయాలలో నిశ్శబ్ద విప్లవం తెచ్చాము.


258

వావిలాల సోమయాజులు సాహిత్యం-2