Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుణ్యకోటి : అబ్బో! అగ్రశ్రేష్ఠుడు గామాలి. (లేస్తూ) బాగా ఆలోచించండి. భుజంగంగారితో వైరం ఏమాత్రమూ మంచిది కాదని మా సలహా. (చిరుకోపాన్ని ప్రకటిస్తాడు)

రేణు : ఇందులో వైరమేముంది?

పుణ్యకోటి : ఏముందంటే సరా. ఉంది. మరి మంచిది (నిష్క్రమణ)

ముసలయ్య : (ప్రవేశిస్తూ) అమ్మా! పాపం చాలా బాధపడుతున్నాడు. మీరు ఒక్కమాటు ఆయల్లమంద దగ్గరకు వెళ్ళిచూడాలి.

రేణు : అలాగా (నెమ్మదిగా ఏదో ఆలోచిస్తూ వెళ్ళుతుంది)

ముసలయ్య : సాయంత్రం సభలో సంగతేమిటో చెప్పించాలిసిందే డాక్టరు బాబయ్యగారిచేత - మారెమ్మొచ్చినప్పుడు మందిప్పించి రక్షించినవాడు గూడెంలో గడ్డివాములు తగలేయించటమెందుకు? -

చైతన్యం : (ప్రవేశిస్తూ) పాపం! చాలా గట్టిదెబ్బ తగిలిందోయ్! (ముసలయ్య అందించే ఉత్తరం చూసి) సరే. సాయంత్రం మీటింగు పెట్టి అన్ని విషయాలూ మాట్లాడుతాను. మీ అందరి అండా నాకు ఉంటే ఇటువంటి భుజంగాలెంతమంది మన్నేం చేస్తారు.

ముసలయ్య : మారెమ్మకు మందు సప్లై చేశాట్టగా బాబూ, భుజంగంగారు.

చైతన్యం : పుణ్యకోటి చెప్పాడా? (ముసలయ్య తలూపితే) ఇతడు వాడి ఏజంటు. ఇప్పుడు వెనుకటిమాదిరిగా కాదు కొత్త ప్రభుత్వంలో ప్రతివాడికీ ఓటు ఉంది - దానివల్ల అన్నీ మారిపోతున్నవి.

ముసలయ్య : మాకు కూడాన బాబయ్యా?

చైతన్యం : మీకేమిటి! మైనారిటీ తీరిన ప్రతివాడికీ. అందుకోసమే ఈ ప్రచారమంతా?

ముసలయ్య : మళ్ళీ భుజంగం వంటివాళ్ళు పెబుత్వానికి రావటం కల్ల బాబయ్యా.

చైతన్యం : అంత చులకనకాదోయ్ ముసలయ్యా! అవసరమైతే సంచులు కుమ్మరిస్తారు మీలో కొందర్ని చీలదీసి కొనేస్తారు. వాళ్ళకు ఎన్ని నాటకాలైనా చేతౌ.

చంద్రశేఖరం : (ప్రవేశిస్తూ ఉంటాడు. చైతన్యం నమస్కరిస్తాడు) శతమానం భవతు శతాయుః పురుషశ్శతేంద్రియ ఎట్సెట్రా.


246

వావిలాల సోమయాజులు సాహిత్యం-2