Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(తెర)

ప్రథమ యవనిక


చంద్రశేఖరం : ఒరేయ్ పుణ్యం! ఇప్పుడీ భుజంగంగాడి దగ్గిర ఏ పాచికైనా పారుతుంది.

పుణ్యకోటి : అందుకనే అప్పుడప్పుడూ వచ్చి రవ్వంత స్తోత్రపాఠం ఘాటుగా పారెయ్యటం - నీ గురుత్వం అబ్బింది.

చంద్రశేఖరం : భేష్! ఐ యామ్ ఎ బిలీవర్ యిన్ కోల్డు ఫ్లాటరీ. ప్రసిడెంటుగిరితో మనిషి ఢిల్లీదర్వాజా అయిపోయినాడు కనిపెట్టావా? 'మంత్రాధీనాస్తు దేవతా' అన్నారు పెద్దలు.

పుణ్యకోటి : ఇందాక నీతో చెప్పానే ఆ ఆయన శిలావిగ్రహంతో మనిషి చిత్తై పోవాలి - అయితే జయ కొంత ఆలోచన ఉన్న మనిషిలా ఉంది?

చంద్రశేఖరం : 'స్త్రీణాం ద్విగుణ ఆహారో బుద్ధిశ్చాపి చతుర్గుణా' అన్నారు పెద్దలు. అందులో కొత్తగా కళాశాల నుంచి వచ్చిన గరల్ కావటం వల్ల ఇంకా కాస్త ఆలోచిస్తున్నది. అయితేనేం? బ్రదర్! స్త్రీ ఎన్నడూ పురుషుడు కాలేదంటే నమ్ము!

పుణ్యకోటి : నిజము. (చిత్రంగా చూస్తూ) ఏ పురుషుడైనా నీబోటి పురుషుడు చస్తే కాలేదు. మరి, నా మనవిమాట ఏం చేశావు?

చంద్రశేఖరం : ఇన్నిమాట్లు నాతో చెప్పటమంటే నన్ను శంకించటం మన్నమాటనేనా మరి?

పుణ్యకోటి : బుద్ధి, బుద్ధి! ఎంతమాట! చచ్చుపీనుగను నిన్ను శంకించటం బ్రతకటానికేరా భాయీ?

చంద్రశేఖరం : ఈ స్వల్పానికే ఇంత బాధపడతావనుకోలేదు.

పుణ్యకోటి : ఓ, నో నో! ఐ యాం ఓ.కె మరి మరచిపోవుకదూ?

చంద్రశేఖరం : ఇదిగో, అభయమిస్తున్నాను! ఇప్పటికి మూడోనెల తిరక్కముందే నీ యింటిముందు పెళ్ళికని కూష్మాండం కట్టించకపోతే అప్పుడడుగు. నేను బ్రహ్మయ్యశాస్త్రి కొడుకునే కాను. నిన్ను వాడి దశమగ్రహాన్ని జామాతను చెయ్యకపోతే...


డాక్టరు చైతన్యం

233