Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుంభీలకుడు : (కఠినంగా) మీకోసం రాని స్త్రీని బలాత్కరించటం ప్రభువులైన మీబోటివారికి పద్ధతి కాదు.

శకారుడు : (వికటంగా నవ్వి) పడతుల విషయంలో ప్రభువేమిటోయ్! ఒక తడవ వాత్స్యాయనంలో పారదారాధికరణం చదువు.

కుంభీలకుడు: (మైత్రిగా దగ్గరకుపోయి) మనం ఈ వెన్నెట్లో అసలైన కథలు చెప్పుకుంటూ కాలినడకన పట్టణంలోకి వెళ్ళిపోదాము.

శకారుడు : అయితే స్థావరకుణ్ణి బండి తోలుకోరమ్మని చెప్పు. - స్థావరకా! నీ గుండెలు తోడుతాను. తోలుకోరావద్దు. (మతిమార్చి) నేను దేవతల ముందరా, బ్రాహ్మణుల ముందరా బండి ఎక్కకుండా రాను. రథమెక్కిపోతుంటే రాజశ్యాలకులని జనం చెప్పుకోవాలి సుమా!

కుంభీలకుడు : పోనీ బండిలోనే వెళ్ళిపోదాం.

శకారుడు : (వసంతసేనను చూచి) నేను ఇప్పుడు రాను. నీవు బండి ఎక్కి వెళ్లు.

కుంభీలకుడు : అయితే మీతో సావాసం చెల్లు.

శకారుడు : ఉఁ

కుంభీలకుడు : (ప్రక్కకు తొలిగి ఆలోచిస్తుంటాడు)

శకారుడు : ప్రియా! ఇంతీ, వాసంతీ, ఓ వసంతకర సరోజ సేమంతీ!

(బాగా దగ్గరకు వచ్చేస్తాడు).

వసంతసేన : అన్నా! అన్నా!! (అని భయంతో కుంభీలకుడి వైపు చూస్తుంది) నీకేమైనా దెయ్యం పట్టిందా. నీకు నేను అక్కను గదరా?

శకారుడు : (కోపంతో) మహారాణి మా అక్కగారితో నా, నీకు ఒంతు. చూడు నిన్నేం చేస్తానో.

కుంభీలకుడు : బావా! బండి సిద్ధం చేయించాను.

శకారుడు : బావా! నీకు కుచ్చుల జరీ అంచు ఉత్తరీయం కావాలా? నాతోపాటు వేడి వేడి ఐణమాంసం తినటమంటే ఇష్టమేనా?

కుంభీలకుడు : అయితే!


184

వావిలాల సోమయాజులు సాహిత్యం-2