Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంతఃకలహాలు పెంచింది. మాచర్లను మరొక రాజధానిగా చేయించి మలిదేవాదులను, బ్రహ్మనాయని, గురిజాలలో లేకుండా పంపించింది. ఏటేటా వారు గురిజాలకు వచ్చి నలగామరాజు ఆధిపత్యాన్ని అంగీకరించి కప్పం కట్టేటట్టు నిర్ణయించింది.

మలిదేవాదులకు రక్షకుడుగా బ్రహ్మన్న కొంతకాలం మాచర్ల రాజ్యాన్ని పాలిస్తూ ఉండగా - ఏ పక్షం వోడిపోయినా ఏడేండ్లు రాజ్యం వదిలిపెట్టి అరణ్యవాసం చేసేటట్లు - పణం పెట్టి అతనిచేత కోడిపందాలకు ఒప్పించి మోసంచేసి నాగమ్మ గెలిచింది.

అష్టకష్టాలు పడి అరణ్యవాసం పూర్తిచేసుకొని వచ్చిన మలిదేవాదులకు తిరిగి మాచర్ల రాజ్యమివ్వమన్న బ్రహ్మన్న కోరికను ఆమె నిరాకరించింది. రాయబారాలమీద రాయబారాలు నడిచినవి. ప్రయోజనం లేకపోయింది. ఉభయ పక్షాలూ యుద్ధమేనని నిశ్చయించుకున్నవి. కారెంపూడి కదనరంగమే! ఆంధ్ర కురుక్షేత్రం!! అదే ఆంధ్ర వీరభారత యుద్ధం!!


12

వావిలాల సోమయాజులు సాహిత్యం - 2