తొలి పలుకు
సంస్కృతదృశ్య కావ్యప్రపంచంలో ఆదికవి భాసుడు జానపద కథా సాహిత్యమునుంచో లేక గుణాఢ్యమహాకవి 'బృహత్కథ' నుంచో ఈ రమణీయమైన కథను స్వీకరించి స్వాయత్తం చేసికొని 'దరిద్రచారుదత్త' రూపకాన్ని సృజించినాడు. మహాకవి శూద్రకుడు మరికొన్ని కథా సన్నివేశాలనూ సంభాషణలనూ కల్పించి కథలో వివిధ ప్రణయవిభేదాలు విస్పష్టంగా గోచరించేటట్లు "మృచ్ఛకటిక”ను కల్పించి సంస్కృతదృశ్యకావ్యసుందరికి ఒక విశిష్టమూ, అమూల్యమూ అయిన అలంకారాన్ని చేకూర్చి విశ్వవిఖ్యాతి గడించినాడు.
ఈ రూపకంలోని గుణాలన్నీ భాస శూద్రక మహాకవులవి దోషములు నావి. 'వసంతసేన' వ్రాసి దరిదాపు ఎనిమిది సంవత్సరాలు కావచ్చింది. నేటివరకూ దీనిని నాటక ప్రియులకు సమర్పించలేక పోయినాను.
ఈ 'వసంతసేన'కు శూద్రకుని కథ కేవల మాధారము. శూద్రకుని కథలో చారుదత్తుడికి ధూతాదేవి పత్నిగా ఉన్నది. ఇట్టి స్థితిలో వసంతసేనపై అనురాగ మనుచితమని యామె మరణానంతర మాతడు వసంతసేనపై అభిమానమును గొన్నట్లు, నేను మార్పొనర్చినాను. మైత్రేయుని పాత్రకు వ్యక్తిత్వం ఉన్నట్లు మూలంలోని కథలో గోచరించదు. వైదికుల ఆ కేకరాలను పరిభాషలను దేవాదేవేషు, అయంవై, వికిరపిండం, బ్రహ్మిష్ఠోబ్రహ్మిష్ఠి, ఇత్యాదులను అతనిచేత పలికించి ఒక ప్రత్యేకత నాపాదించటానికి ప్రయత్నించాను. శకార పాత్రకు 'వెర్రిపాటలను' పెట్టటంలో వినూత్నతను ఉద్దేశించాను. ఇతని విషయంలో వసంతసేన ఇంటిముందు తిరుగాడటం, వీధిభాగవతం ఆడటానికి యత్నించటం నూతన కల్పనలు. మదనికాశర్విలకుల యన్యోన్యానురాగాన్ని వసంతసేన గ్రహించి వారికి వివాహం చేయటం కూడా స్వతంత్ర కల్పన.
ప్రదర్శనానుకూల్యతకోసం ఇందులో ఒక దృశ్యం దీర్ఘంగాను, మరొక దృశ్యం స్వల్పంగాను కల్పించడమైంది. ఇందలి అల్పదృశ్యాలన్నీ ప్రథమయవనికలు (Curtain Risers) ప్రాచీన నాటకాలల్లోని విష్కంభాలను పోలినవి. విశ్రాంతికోసం
వసంతసేన
105