హిందీలోని విశిష్ట ఖండకావ్యాల్లో ఆంసూ (అంసూ) ఒకటి. 'ఆంసూ' అంటే కన్నీరు. తెలుగులో కవిత్రయంలా ఆధునిక హిందీ సాహిత్యంలో ప్రసాద్ పంత్-నిరాలా లు భావకవిత్రయంగా, 'ఛాయావాద కవిత్రయం'గా పేరుపొందారు. వీరిలో ప్రసాద్ అంటే జయశంకరప్రసాద్. ఈయన 1925లో రాసిన కావ్యమే ఆంసూ. ఇది బహుధాప్రశంస లందుకోవటానికి కారణం దీనిలోని వస్తువు, భాష. అంతే కాదు, వేదనకి అక్షరరూపమిస్తే అది ఆదికావ్యంలా అజరామరమే కదా! 'కన్నీరు' ఒక మహోత్కృష్ట సృష్టి!
మహాకవి జయశంకర ప్రసాద్ 19వ శతాబ్ది తొలి దశకంలో బెనారస్ (వారణాసి) లో కాన్యకుబ్జ వంశీయులైన ఒక వైశ్యకుటుంబంలో జన్మించాడు. బాల్యమంతా ఆధ్యాత్మిక వాతావరణంలో గడిచింది. 12 ఏళ్లకే తండ్రిపోవటం, ఇంటి దగ్గరే చదువుల వల్ల ఆయనలో కొన్ని ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. కాలక్రమంగా ప్రసాద్ ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, ఫార సీ, సంస్కృతం, ప్రజ భాషలు క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. పురాతత్త్వ (పరిశోధనా) విషయాలు, వేదోపనిషత్పురాణేతిహాసాలు, బౌద్ధాది మత సాహిత్యాలన్నీ ఆసాంతం ఆకళింపు చేసుకున్నాడు.
బాల్యం నుండి ఎదురైన కష్టాలు ప్రసాద్ని భావుకుణ్ని, కవిని చేశాయి. 1911లో తొలిగా ఆయన 'కానన్ కుసుమ్' కవితాసంపుటి వెలువడింది. 'ప్రేమ పథిక్' రెండో రచన. 1925లో 'అంసూ' వెలుగు చూసింది. అయితే 'కామాయని' ఆయనికి కీర్తి కిరీటమయ్యింది. దాని ఆవిష్కరణతో ప్రసాద్ మహాకవిగా స్థిరపడిపోయాడు.
కవితలే కాకుండా, నాటకాలు, చారిత్రక నాటకాలు, కథలు, నవలలు, వ్యాసాలు, ఎన్నెన్నో రాశాడాయన. హిందీలో ఆయన పేరు మీద ఒక 'యుగమే ఆరంభమయ్యింది. ఆ మహా ప్రతిభావంతుడు 1936లో కన్నుమూశాడు. లోకానికి 'అంసూ' మిగిలింది. జీవన సమరాన్ని ప్రేమశక్తి జయిస్తుందని 'ఆంసూ' ఆంతర్యం ఆయన నమ్మకం. దాన్నెవరు కాదనగలరు?
'ఆంసూ' కంటే ముందు ప్రసాద్ లౌకిక ప్రేమ, యౌవన విలాసాలు, విశృంఖల స్వప్నాలు, స్వేచ్ఛాభావాలు ప్రతిపాదించాడు కానీ 'ఆంసూ' వచ్చేసరికి ఆయనలో జీవిత యథార్థ సంఘటనలు, వాస్తవిక అనుభవాలు చోటుచేసుకున్నాయి. ఈ'కన్నీరు' కళ్లనే కాదు హృదయాన్ని కూడా ప్రక్షాళనం చేసి పవిత్రీకరిస్తుంది. మానసిక ఉద్వేగం అణగారిపోయిన తర్వాత చిందిన కన్నీరిది. ఈ కావ్యంలో బాధల మధ్య నిలద్రొక్కుకోవటంలోనే జీవితానికి అర్థం, పరమార్ధము వుంటుందని, అప్పుడే 686 వావిలాల సోమయాజులు సాహిత్యం-1