Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా. హాసౌజ్వల్య రసోల్బణ ప్రథితమై ఆరగ్వధ ప్రక్రియన్
    వాసించున్ సకలాశలందు ధరణీపా లావతం సోన్నత
    ప్రాసాద ప్రమదావనాంతలతికా వాల్లభ్యపుష్పాళిలో
    నీ సమ్మోహన ముగ్ధరూప సుమ మో నీరేజపత్రేక్షణా!

మ. నిను సామాన్యగ జూచు నేత్రముల కున్మేషంబు రాబోదు తీ
    రని కోర్కుల్ దయివారగా తెనుగునేలన్ నృత్యపాథోధి ఖే
    లన సంజాత రసామృతమ్ము పొలుపారం బంచిపెట్టంగనై
    జననం బందితి వంచు నెంచెద నినున్ సంధ్యారుణోద్యత్ప్రభా!

మ. అతిపుణ్యుండవు జాయపా! దొరికె నయ్యా నృత్యరత్నావళీ
    కృతికిన్ ఈ అభినేత్రి మాచలయె, నీ కీర్తిధ్వజం బెత్తి భా
    రతదేశాన త్రిలింగ నృత్యభరతా! లాస్య క్రియాజ్యోతి నా
    తత దక్షత్వముతో రగిల్చి వెలుగొందన్ నిల్పు నశ్రాంతమున్.

శా. జాయా మధ్యగత ప్రభూత్తముని విస్ఫారాక్షియుగ్మమ్ముపై
    నీ యాకేకర నేత్రకోణరుచి సందేహ ప్రమోదమ్ముతో
    నాయత్తం బగువేళ బొల్చు స్మితమందాక్షమ్ము దేవేరులం
    దా యర్ధాంగిను లే మెరుంగుదురు సఖ్యం బో రసానందినీ?

మ. శివ నీవై, ప్రభువే సదాశివుడుగా క్షేమంకరోద్య ల్లయో
    త్సవవేళానటనం బొనర్చుతరి నే ధన్యుల్ మిమున్ జూచిరో,
    యెవ రానందరసాబ్ది మగ్నులయిరో ఎవ్వారు స్తంభించిరో
    భవరాహిత్యము కల్గు వారి కని నే భావింతు నో నర్తకీ!

ఉ. నేనును నీవు నాంధ్రధరణీపతి కొల్వున సర్వశాస్త్రపా
    రీణులమై విరోధి నవలీలగ గోష్ఠులు గెల్చినార మం
    చే ననుకొందు - కాక కలదే మనకున్ మన ఓరుగంటికిన్
    ఈ నయగారపుం బ్రణయ మేర్పడ కొండొక కారణం బిలన్? 11

('సాహితీ సమితి' రజతోత్సవ సంచిక 1946 జులై)


54

వావిలాల సోమయాజులు సాహిత్యం-1