పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాంత పథికుడు

శ్రమ వారిబిందువులు కమనీయతల తోడ
ముఖ చంద్రమండలము ముద్దులొలుకగ నడతు ..శ్రమ..

దినకరుని కిరణాల తీవ్రతకు తనువెల్ల
నలసి పోవుటజేసి యాయాసముల కోర్చి...శ్రమ..

పదపద్మముల యందు ప్రాణ నాడులు విరియు,
వ్రేళ్ళ పుటములు జూడ వేడి బొబ్బలు పొక్క...శ్రమ..

కార్య సాధనదీక్ష కడు బడలిననుగాని
నిలువ నీయక నిన్ను పలుతొందరల పెట్ట...శ్రమ..

ఎటు చూచినను గాని యేపల్లె పక్కణము
చక్షు గోళమ్మునను వీక్షణమ్మున లేదు...శ్రమ..

తుది మొదలు గనలేని దొడ్డ బాటను బట్టి
వెనుక చూపే లేక వెర్రినడకల నడతు...శ్రమ..

తలదాచుకొనుటకై ఫలవృక్షముల నీడ
కరవగును, సుంతయును కలగబోదు సుఖంబు...శ్రమ..

ఏ చెట్టు నీడనో యింత నిలుచున్నచో
ఆకులన్నియు రాలు నంత పండెండయే...శ్రమ..

________________________________________________________________________________________

450

వావిలాల సోమయాజులు