పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

శా. ఆలోచింపకమున్నె నల్దెసల ప్రౌఢానంత వాసంత లీ
లాలాలిత్యము క్రుమ్మరించితివి, ఉల్లాసంబుతో కాననం
బీలీలన్ భవదీయ దివ్యవిభవోద్వృత్తిన్ ప్రసాదించెనో
యీ! లోపమ్ము వసంత రాజ! కన లేనేలేదు పో నీయెడన్.

6


చ.

చ. నను గని నవ్వుచున్నది వనం బొక యుప్పెననవ్వు నేడు నా
మనమున ధైర్యమొక్క యణుమాత్రము నిల్వదు, జారిపోయె నీ
ననవిలు నిల్వ నోపకను నా కరకంజము నుండి, యెట్లుగా
ననితర సాధ్యు నీశు పరమాత్ముని తాపస వృత్తి మాన్పుదున్?


మ.

మ. సుమబాణావళితో జగత్రయము నే సుత్రాముకై గెల్చి ఆ
య్యమరేంద్రాసనరక్ష సేయుదు గదా, అస్మద్బల ప్రౌఢికిన్
సమ మే లోకములోన నున్నదని యిచ్చన్ గర్వినైపోదు నా
ప్రమదం బీయెడ భగ్నమయ్యె, సురకార్యం బెట్టు లీడెరునో?


ఉ.

జీవన పుష్ప సౌరభము చిత్రగతిన్ మటు మాయమయ్యె నే
మో? విధి యీ యెడన్ నను విమోహదరిద్రునిగా నొనర్చి బా
ధావిపినాంధకారమున దారులు మూసి, దవాగ్ని వెట్టె దే
వా! వగతీరి నాకు నిరుపాధి మరెన్నటికో మహేశ్వరా!


ఉ.

“అచ్చరపిండు వెంటగొని, ఆమనియున్ మలయానిలుండు నీ
నచ్చిన నెచ్చెలుల్ ప్రియముమై సహవీరత వెంటరాగ, నా
పచ్చని చిల్కతేరు పరవళ్లను ద్రొక్కగ, పుష్పధన్వినై
మెచ్చ మదిన్ శచీప్రియుడు, మించుచు వచ్చితి భర్గుగెల్వగన్.


ఉ.

ఓ మలయానిలా! సఖ!! మహోదయ!! నీదగు నృత్యకేళి నా
రామమునన్ తరుల్ సుమవిరాజిత ముగ్ధలతానుషంగముల్
కామకళారసజ్ఞతల గాఢవినిద్రిత చిత్తవృత్తులై
నామది కింపుగూర్చెడి యనంతవిలాస శకుంతసంతతుల్.


చ.

చ. ప్రసవశరాసనోజ్జ్వల విలాసములన్ గనలేదు లోప మో
అసమశరా! త్వదీయధనురంచిత బంభరమంజు శింజినీ
రసభరఝాంకృతిధ్వనికి రా దిసుమంతయు భంగపాటు, నీ
పసతరుగంగ దీనతకు పాల్పడె దేటికి? ఉద్యమింపుమీ?”

12

శివాలోకనము

41