పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చెరువుకు గండి కొట్టె గుమి జింకల మా పొలమందు తోలె, మా
అరకల కర్లు లాగె పొలమందలి మంచెల పాడుచేసి కా
పరులను కొట్టి పంపె, గునపమ్ముల మట్టిలొ పూడ్చె చెట్టుపై
మరుగగు దుత్తలో చలిది మాయము చేసె నటంచు పల్కినన్.


ఈడుకు తగ్గ చేష్టలగునే వ్రజభామినులార! యంచు నే
నాడగ నోడినాను శిశువా! ఎట వారలు 'చిన్న బిడ్డ లీ
యీడుకు కొండలెత్తుచు ఫణీశులతో చెరలాట మాడిరే
యేడవి మాట లమ్మ' యని యెచ్చట దెప్పెదరో యటం చెదన్.


ఒక చిరునవ్వుతో నెడద నుయ్యెలలో నిదురింపచేతు వా
నిక పలువిప్పి మాటలను ని న్ననలేనుర! జన్మతోడ నీ
వొక నటకాగ్రగణ్యుడవు ఉన్నది కాదనుపించు శక్తి యే
తికమక పెట్టియో హృదయ తీవ్రత మాన్చెదురా వివేకివై.

                   (ఆనందవాణి, 1946 దీపావళి సంచిక)

________________________________________________________________________________________

శివాలోకనము

39