ఆకాశనీలాల కవ్వలి సీమల మేరలకు ఎగురగలిగే ఎత్తయిన భావాలు - కడలి లోతులు తడివి చూడగల నుడికారపు కెరటాలపై తేలియాడే పలుకుబడులు కలిస్తేనే - అది ఆలోచనామృతం అనదగిన కవిత అవుతుంది. కవిత - ఆపాతమధురం కాదు. శ్రీసోమయాజులుగారి కవనాలు తొలకరి చిటపొటి చినుకులు కావు. అవి వేసవి వడగళ్ళ వానలు.
వీరు వ్రాసిన పద్యనాటికలు, ఏకాంకికలు రంగస్థలాన్ని, ఉరుములతో మెరుపులతో నింపేస్తాయి. వీరు వ్రాసిన గద్య పద్య నాటకం - “నాయకురాలు” ఆంధ్ర నాటక రంగస్థలంపై వడగళ్ళు - ఉరుములు మెరుపులు సృష్టించటమే గాక - పిడుగుల పిండు కురిపించింది.
శ్రీసోమయాజులుగారి గద్యరచనకు గీటురాయి “మణి ప్రవాళం” వ్యాసమంజరి. వ్యాసరచన తెలుగువారు అభ్యసించిన క్రొంగొత్త విద్య. తెలుగు వారికి ఈ కళలో ఒరవడి దిద్దినవారు ఆంగ్లేయులు. ఆంగ్ల వ్యాసరచయితలలో తాడిని తన్నినవారు - భారతీయులు కొందరు ఉన్నారు. తాడి తన్నినవారి తల తన్నినవాడు ఆంధ్ర “మణిప్రవాళ” వ్యాసమంజరి రచయిత. వ్యావహారికమైన కర్మ జగత్తులలో బ్రతుకు పోరాటంలో విశ్రాంతి కోరేవారు అవశ్యం చదువదగినట్టిది “మణిప్రవాళ” వ్యాసమంజరి.
ప్రస్తుత గ్రంథంలో ఉన్న కావ్యఖండికలు - ఉజ్జీవము. పరివర్తన, మాచలదేవి, ఆత్మార్పణము, విన్నపం మున్నగునవి. ఇవి అన్నీ లోగడ ప్రతిభ మున్నగు పత్రికలలో పడినట్టివే. ఇందలి పరివర్తన రామ బాణోపహతుడైన వాలి స్వగతం. ఆత్మార్పణం కర్ణుడు శ్రీకృష్ణునితో జరపిన ఏకాంత సంభాషణ. ఈ రెండు ఖండికలు వింటే వాల్మీకి - వ్యాస మహర్షులు తలలూపక తప్పడు - అని నా అభిప్రాయం. మహాభారత రామాయణ కావ్యాలే కాక కాళిదాస ప్రభృత కవులు చేసిన ప్రౌఢప్రయోగాలు, శ్రీసోమయాజులుగారి తెలుగు కవితలలో ఎడనెడ సాక్షాత్కరిస్తాయి. మూడు వేల సంవత్సరాల సంస్కృత ప్రౌఢప్రయోగాలు, వేయి సంవత్సరాల గడుసరి తెలుగు నుడికారపు సొంపులు, వంపులు స్వాయత్తం చేసుకున్న సంస్కారి శ్రీసోమయాజులుగారు.
నేను అనంతపురంలో ఉన్నప్పుడు - శ్రీసోమయాజులుగారు పద్యాలలో ఒక “సుహృల్లేఖ” నాకు అందించారు. అది ఒక అపర మేఘసందేశకావ్యం. ఆయన దూతగా పంపిన మేఘుడు
శివాలోకనము
23