అక్షరాంజలి
ఈనాడు - స్ఫురద్రూపియైన వయోవృద్ధుడుగా సమకాలీనలోకానికి కన్పించే శ్రీవావిలాల సోమయాజులుగారు - నాకు సుమారు ఒక అర్ధశతాబ్దికి పూర్వం - జ్ఞానవృద్ధుడైన కవి కుమారుడుగా సుపరిచితులు. “శ్రీసోమయాజులుగారికి రావలసిన కీర్తి రాలేదు" అని అప్పుడప్పుడు నాలో నేను అనుకున్నాను గాని, అది సరియైన అభిప్రాయం కానే కాదు. అభిజ్ఞులు పలువురకు సాహితీతపస్వి శ్రీసోమయాజులు గారి రచనల విలువ తెలుసు. సమకాలీన విజ్ఞులు ఆయనను "కుమార ధూర్జటి” - “సాహిత్యాచార్య” - “సౌహార్ద సారథి" “సాహిత్య బంధువు" - "సాంస్కృతిక సింధువు" ఇత్యాది బిరుదులు ఇచ్చి సత్కరించారు. “వెన్నవంటి చిరునవ్వు” - “వేణువు వంటి కంఠస్వరం” - “వేదం వంటి విజ్ఞానం” “వేలుపు వంటి రూపం” - పంచ వషట్‌కార సంస్కార సంపన్నుడు శ్రీవావిలాల సోమయాజులు అని సాహితీ సహవ్రతులు ప్రస్తుతించారు. నేడు ఈ కవితా ఖండికలు ప్రచురించటానికి నడుం కట్టుకొని ముందుకు వచ్చిన శ్రీఊట్ల కొండయ్యగారు విజ్ఞులలో విజ్ఞుడు.
శ్రీసోమయాజులుగారి కవితలకు పరిచయ వాక్యాలు వ్రాయగలిగిన ఏకైక వ్యక్తి సాహితీ సమితి సంస్థాపకుడు సభాపతి స్వర్గీయ తల్లావజ్ఝల శివశంకర శాస్త్రిగారు. నేడు వారు లేరు. ఇక సోమయాజులుగారితో కలిసిమెలిసి తిరిగినవారు పలువురు భూలోకంలో లేనే లేరు. నేటికీ సజీవుడై యున్న వయోవృద్ధుడను నేను గనుక ఈ “భారం” నా మీద పడింది. నిజానికి ఇది భారం కాదు, నా భాగ్యమే!
1942 సంవత్సరంలో శ్రీజంధ్యాల పాపయ్యశాస్త్రి గారు, శ్రీవావిలాల సోమయాజులుగారు, నేను తరచు శ్రీ శివశంకర శాస్త్రిగారిని గుంటూరులో దివ్యజ్ఞాన సమాజం ఆవరణలో సాయంసంధ్యా కాలంలో కలుసుకుంటూ ఉండేవారం. శ్రీ శివశంకరశాస్త్రిగారు సహజసాహితీ కవచకుండలాలతో అవతరించిన “సభాపతి”. ఆయనకు ఆప్తమిత్రుడు నవ్య సాహిత్య పరిషత్తు కార్యదర్శి శ్రీతెలికిచెర్ల వేంకటరత్నంగారు అక్కడకు వచ్చేవారు.
శివాలోకనము
21