Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముందుమాట

అభిజ్ఞ రసజ్ఞుల కరకమలాలను అలంకరించిన ఈ కావ్యం పేరు “శివాలోకనము”. దీనిని రచించినవారు "కుమార ధూర్జటి" బిరుదాంకితులు శ్రీవావిలాల సోమయాజులు గారు.


ఉ. కలువలు పూచినట్లు, చిరుగాలులు చల్లగ వీచినట్లు, తీ
    వలు తల బూచినట్లు, పసిపాపలు చేతులు చాచినట్లు, క్రొ
    వ్వలపులు లేచినట్లు, చెలువల్ కడకన్నుల చూచినట్లు ఆ
    త్మలు పెనవైచినట్లు కవితల్ రచియింతురహో మహాకవుల్!!


సుమారు నలభై సంవత్సరాలకు పూర్వం కవితాసరస్వతి స్వరూపాన్ని నిరూపించుతూ నేను వ్రాసిన పద్యమిది. ఇటువంటి కవివరేణ్యుల కోవకు చెందినవారు శ్రీవావిలాలవారు.

సహృదయ బంధువూ, సారస్వత సింధువూ, సౌజన్య నీరధీ, సౌహార్ద సారథీ అయిన శ్రీవావిలాలవారు తమ కవితా సంపుటికి “శివాలోకనం” అని పేరు పెట్టారు.

శివాలోకనం! ఎంత చక్కని పేరు? ఎంత చిక్కని పేరు? "శివ" శబ్దానికి ఈశ్వరుడు అనీ, శుభం అనీ అర్థం. “శివా” శబ్దానికి పరమేశ్వరి అని అర్థం. “శివాలోకనం" అని తన కావ్యానికి పేరు పెట్టటం వల్ల పైన చెప్పిన మూడింటి ఆలోకనం అనీ, కవి హృదయం అవగతమవుతున్నది.

ఈ కావ్యంలో మొత్తం ఎనిమిది కవితా ఖండికలు ఉన్నాయి. అవి, వాత్సల్యప్రియ, ఉజ్జీవము, పరివర్తన, భ్రష్టయోగి, మాచలదేవి, ఆత్మార్పణము, విన్నపము, బృహన్న లాశ్వాసము అనేవి. శివాలోకనంలోని ఈ అష్ట ఖండికలూ అష్టమూర్తి అయిన పరమశివుని స్వరూపాన్ని స్పురింపజేస్తున్నాయి. ఇలా తన కావ్యం ద్వారా ఆ "ధూర్జటి”ని, ఈ "కుమార ధూర్జటి” మనకు ప్రత్యక్షం చేయించటంలో ఎంతో ఔచిత్యం ఉంది.

“వాత్సల్య ప్రియ”లో చిన్ని కృష్ణుని అల్లరి పనులు మానమని అనేక విధాలుగా బోధిస్తున్న మాతృమూర్తి యశోదాదేవి అంతరంగ తరంగాలు పొంగిపొరలాయి.


శివాలోకనము

15