'నేను కవిని '
తే. నేను కవిని పూజారిని నేను నిరత
మమృత సౌందర్య దేవీ శుభాలయమున,
అమల కమనీయతా గీతు లాలపింతు,
అర్థి నెఱిగింతుఁ బ్రణయ రహస్యములను.
చ. ఎనసి వసంతు నేత్రముల నేడ్తార నిండిన హర్షబాష్పముల్
కనుగొని ఆశయున్ వెలుగు క్రమ్మర న న్నడిపింపఁ జేతు జీ
వనమును - భావ వీథుల నవారణ విశ్వము సుట్టివత్తు నే
ననయము చంద్రుఁ డీ భువి నిరంతరము స్వలయించు కైవడిన్.
చ. కలికి గులాలు పూవుటెద కందు కనుంగొని విహ్వలించి య
వ్వల తపియింతు - నార్గిసు సువాసనలన్ హసియించె నేనికన్
నిలుపుకొనంగ జాల నెద నిండి తొణంకెడి సంతస మ్మెదో
కొలుతును “ప్రాత” - ప్రీతిమెయి క్రొత్తను సృష్టి యొనర్తు నేనికన్.
ఉ. ఎంచి వినూత్న పుష్పముల నెల్ల, మరందము బిచ్చమెత్తి ప్రే
మాంచిత మాధురీ మహితమై వెలుగొందెడి, గీతులల్లి కా
వించగ గాన్క తూర్పునను విశ్రుతమౌ నరుణాభ కైవు మై
నుంచితి పత్రమే ఎదుట - ఉజ్జ్వల లేఖిని గేలఁ దాల్చితిన్
ఉ. ఓజమెయిన్ వసంతఋతు వొప్ప వహించెడి నూత్నతల్ రస
భ్రాజిత నిర్ణయిరీనిరత బంధురవేగము ఫుల్లదాడిమీ
బీజ మనోజ్ఞశబ్దములు, పేశలశౌక్తికమౌక్తిక ప్రభా
రాజిత మంజులార్థములు రంజిలు నా సుమముగ్ద గీతులన్.
చ. పరగ రసజ్ఞుఁడై యుదయభాస్కరుఁ డయ్యపరంజికాంతుల
నిరిశిఖరాన నిల్పి తులకించెడి దృశ్యముఁ జూపనెంతు - భా
స్వర సుమసంతతిన్ మధువసంతుని, 'బుల్బులు' పాటగాని నా
సురుచిర కావ్యవీథుల శిశుప్రణయమ్మున నిల్వఁ బిల్చెదన్. 6
128
వావిలాల సోమయాజులు సాహిత్యం-1