'నాప నారసింగ '
ఆ.వె. యుద్ధమన్న వీరుఁ డుత్సాహ వంతుఁడౌ
పిరికి వాని గుండె ప్రిదిలిపోవు
చా వొకండె రెండు చావులు గల్గునా
నమ్మవోయి చవట నారసింగ!
ఆ.వె. ఆలి విడిచి వేశ్య కర్పణంబైపోవు
నట్టివాఁడు రసికుఁ డౌనె తలఁప
అద్దె గుఱ్ఱ మెట్టు లగడితల్ దాటురా
నమ్మవోయి చవట నారసింగ!
ఆ.వె. కన్నులున్న తెరచి కనలేని దొరలకు
చెప్పుకొన్న వినఁగఁ జెవులు లేవు
కనులు చెవుల కుంటె కడుపుకుఁ జెప్పాలె
నమ్మవోయి నాప నారసింగ!
ఆ.వె. ఉన్న మంచివాని యుద్యోగమును దీసి
క్రొత్త 'మలప' కిచ్చు గుణము చూడ
కాకిఁ గొట్టి గ్రద్ద కర్పించినట్లౌను
నమ్మవోయి నాప, నారసింగ!
ఆ.వె. చందురుండు పాన్పు - పందిరి - యద్దంబు,
పద్మబాంధవుండు, పతక మణియె
యైన రావణుండు హతమారిపోలేదె!
నమ్ము మిద్ది నాప, నారసింగ!
ఆ.వె. ఆట వెలఁది మీద నభిమాన మేర్పడ్డ
నంటురోగములకు నడలరాదు
సంపెఁగ పొద - చుట్టు సర్పంబు లుండవా?
నమ్ము మోయి నాప నారసింగ! 6
126
వావిలాల సోమయాజులు సాహిత్యం-1