పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

320

వాసిష్ట రామాయణము

యదియును మఱచి బ్ర-హ్మైక్య సంధాన
మొదవఁగా, నందు మ-నోన్మని నొంది,

యిది యది యనుట లే-కేకమై నిలిచి,
కదల కున్నది నిర్వి-కల్పసమాధి

యగు; మఱి జన్మ క-ర్మాదులు లేక
మిగులుచు వ్యాపక-మే స్వరూపముగా

గలుగ, నానందమే - ఘనశరీరముగఁ
గలుగగా మహదాది - ఘనతత్త్వములకు620

నాధారభూతమై - యవ్యయంబైన
బోధస్వరూప సం-పూర్ణచిద్రసము

లో లీనమగుచు బా-లుని మాడ్కి, జడుని
పోలిక, బలువేల్పు - పూనిన వాని

కరణి సంకల్ప వి-కల్పవృత్తులను
మఱచుచు దేహాభి-మానంబు లేక

యపు డనుభూతిర-సావేశ మెసఁగ,
విపులంబుగా బుద్ధి - విశ్రాంతి నొంద,

మురువొప్పఁగాఁ దుది - మొదలు దోఁచకయె
నెఱసి యంతట నిండి - నిదురించువాని630

పగిది నున్నది యసం - ప్రజ్ఞాత మనఁగఁ
దగిన సమాధియై - తనియుచు నుండు;

శ్రీరామ! నీకు నేఁ - జెప్పినరీతి
నాఱు సమాధు లి-ట్లభ్యసింపుచును

ననఘులై వర్తింతు - రార్యు లటన్న
మునిని వీక్షించి రా-ముఁడు పల్కె మరలఁ: