పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

316

వాసిష్ట రామాయణము

చెలువొప్ప నాద్యంత - చిన్మాత్ర మగుచు
నలువుగా నిత్యమై-న పరస్వరూపు

మూడవది యటంచు - మునినాయకుండు
వేడుకగాఁ దెల్ప, విని రాఘవుండు

మరల నాలోచించి - మౌని నీక్షించి
'సారిది జాగ్రత్స్వప్న - సుప్తి నిష్ఠంబు

గాని తుర్యమును త-క్కక తెల్పుఁ డనిన
మౌని రామునిఁ జూచి - మఱియు నిట్లనియె:

విహితంబుఁ జెప్పెద - విను మనుజేంద్ర!
యహమికాసహమీక - లాత్మఁ దోఁచకను530

సత్తు నసత్తను - సంజ్ఞలు మఱచి,
చిత్తవిశ్రాంతినిఁ - జెంది, నిర్మలుఁడు

సర్వశాంతుఁడునైయ-సక్తుఁ డైనదియె
నిర్వాణపదతుర్య - నిష్ఠ యౌ, నందుఁ

బొరిఁ బొరి సంకల్ప-ములు లేమి నదియె
పరసజాగ్రత్తయు - స్వప్నమున్ గాదు.

అరసి చూచినను జా-డ్యము లేనికతన
సురుచిరంబైన సు-షుప్తియుఁ గాదు,

నెఱయు నహంకార - నిరసనబుద్ధి
నఱిముఱి సమతోద-యంబగు నందుఁ540

జిత్తంబు విశదమై - చేష్టింపకుండు,
నత్తఱి నందుఁ దు-ర్యావస్థ పొడము;

భూనాథ! నీవు ప్ర-బుద్ధుండ విలను
గాన నీబోధ చ-క్కఁగ వృద్ధిఁబొందె.