పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

210

వాసిష్ఠరామాయణము

ఇట్టి జగద్భ్రాంతి - కేనాఁటి కవధి
పుట్ట, దేనేమి చె-ప్పుదు నింకమీఁద? 190

నీ వడిగిన వెల్ల - నిశ్చయంబుగను
నే వినిపించితి, - నీ వింక నేమి

వినవలతు?' వటన్న - విశ్వాస మొదవ
నొనర నే నీ ట్లంటి - 'నో వాయ సేంద్ర!

'పరఁగఁ బుట్టుచు గిట్టు - ప్రాణు లేరీతిఁ
జిరజీవు లగుదురు? - చెప్పవే! తెలియ'

నన వాయ సేంద్రుఁ డి-ట్లనె 'మునినాథ!
వినుము చెప్పెద నిది - విశదంబుగాను,

అరయఁగా దోషంబు - లను మౌక్తికముల,
నఱిముఱి వాసన- లను తంతువులను 200

వరుసగాఁ గూర్చి, య-వ్వలఁ గూర్చుసరణి
మఱచి యూరక - యున్న మదిగలవాని

బట్టదు మృత్యు వే - పట్టుననైన,
నట్టి చందం బెట్టు? - లనినఁ జెప్పెదను.

వినుము పావనమును, - విమలం బనేక
మును, చిన్మయము, సౌ-ఖ్యమును నైన పరమ

పదమునం దెవ్వని - భావనచేతఁ
గుదిరి చిత్తము గరం-గుచు నుండు, నట్టి

వాని నమ్మృత్యు దే-వత పట్ట వెఱచుఁ,
బూనిన సంసార - భోగవిచార

కర్మమూలములైన - కామాదిరిపుల
మర్మముల్ గని, వాని - మర్ధించి విడిచి,