పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

139

తృతీయ ప్రకరణము


యచట నున్నట్టి శు - క్రాచార్యుఁ జూచి,
ప్రచురభ క్తిని మొక్కి - పలికె 'నో గురుఁడ!310

నే నన నెవ్వండు? - నీ వన నెవఁడు?
ఈ నిఖిలం బెట్టి? - దెఱిఁగింపుఁ' డనఁగ

నక్కడ బలికి శు - క్రాచార్యుఁ డనియె:
నెక్కువ మాటల - కిది వేళగాదు,

అతివేగమున దివి - కరుగంగ వలయు,
హితమొప్ప మును పెద్ద - లెల్ల శోధించి

మిక్కుటంబుగఁ గని - మెచ్చుకొన్నట్టి
నిక్కంబు విను రజ - నీ చరాధీశ!

యొక్కయుక్తినిఁ దత్త్య - మున్నంత నీకుఁ
జక్కఁగాఁ జెప్పెద - సర్వంబు నందుఁ 310

జిక్కి చిక్కక యుండుఁ - జిన్మాత్ర మంత
కెక్కువ యగువన్తు - వెక్కడ లేదు;

అధియె నీవును, నేను, - నఖిలవిశ్వంబు.
ఇది యథార్థము సంశ - యింపకు మీవు;

ఇది నిశ్చయింపక - యెల్ల మార్గములఁ
జెదరిపోయిన వాఁడు - చేసిన వెల్ల

విరివిగా బూదిలో - వ్రేల్చు హవిస్సు
కరణినిఁ బడిపోవు, - గతి నియ్య దనఘ!

కదిసిన చిచ్భేద్య - కలితుఁడు బద్ధుఁ,
డది మాని తనుఁ జూచు - నతఁడు ముక్తుండు;320

కావున సతత మ - ఖండ భావమున
నీవు నిన్‌ గనుఁగొంచు - నెమ్మది నుండు!'