పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

వాసిష్ఠరామాయణము

గనుకఁ దదన్య మె - క్కడ లే'దటంచుఁ
దన యనుభవముచేఁ - ధాఁ బూర్ణుఁ డయ్యె;

నని కచువృత్తాంత - మమర వసిష్ఠ
ముని తెల్పి, మరల రా - మున కిట్టు లనియె:

'ఎవ్వండు సత్త్వంబు - నెనయుచునుండు
నవ్విమలుఁడు వాఁడ - యనిశంబు కనక 740

కమలంబు రీతిఁ బ్ర - కాశింపుచుండు'
నమరఁ గోరఁడు కోర్కె, - లాత్మయం దెపుడు

మొనసి రమించు, ని - మ్ముగఁ జంద్రబింబ
మున శైత్యగుణము గ్ర - మ్ముచునుండు కరణి

నా యోగి హృదయమం - దమల శాంతంబు
పాయక యుండు; న - ప్పగిదినిఁ జిత్త

శాంతిఁ బొందుము రామ - చంద్ర! యీ బాహ్య
చింతల నొందక, - చెలఁగి నుఖించు!

ఓరామ! యిది రహ - స్యోపదేశంబు,
సారంబుగా నెంచు - స్వాంతమం' దనుచుఁ 750

దెఱ గొప్ప నీద్విస్థి - తి ప్రకరణము
కరుణను విజయ - రాఘవునకుఁ దెలియ

నా వసిష్ఠుఁడు చెప్పె - ననుచు వాల్మీకి
ప్రావీణ్యశాలి భర - ద్వాజ మునికి

మనము రంజిలఁ జాల - మన్నించి పొసఁగ
వినిపించె నత్యంత - విశదంబుగాను.