పుట:Thimmarusumantri.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠప్రకరణము

85


ములకాలము గడువీయ వలయును. అశ్వపతులును, గజపతులును, బలవంతులు. వారలతో నొకమాఱుగా వైరముఁబెట్టుకొనుట యనర్ధహేతువు. నీవు నీసోదరపుత్త్రుని దూరముగాఁ భాఱఁద్రోలి పట్టాభిషిక్తుడవై పరిపాలనము చేయఁబూనితివి. నీకు నీసామ్రాజ్యమునఁ బ్రబల శత్రువులు గలరని యెప్పుడు నేమరకయుండుము. నిన్నుఁ బదభ్రష్టుని జేయ నవకాశము కొఱకు నిరీక్షించుచుందురు. ఇట్టి సందర్భమున వెనుకముందు లాలోచింపక బలవంతులతోడ యుద్ధముల కుపక్రమింతుమేని దానఁ బ్రమాదము గలదు. ఇట్టివానికై వేగిరపాటు కూడదు. రాజ్యాంగమును బలపఱచుకొనవలయును. సైన్యములను సమావేశపఱచుకొని తగు సంస్కారములను గావించి సంసిద్ధముగా నుంచుకొనవలయును. అర్దంబులను దెచ్చి భండారము నింపవలయును. ప్రధానదుర్గంబులు తృణకాష్టజలసమృద్ధంబు లగునట్లుగా సిద్ధపఱచుకొనవలయును. దుర్గప్రాకారములను, వప్రంబులను, కొమ్ములను, క్రొత్తతళంబులను, అగడ్తలను, అట్టళ్లను, జంత్రంబులను, అనువుపఱచుకొని, ధాన్యంబులాదిగా వస్తువర్గముల సమకూర్చుకొని, విశ్వాసపాత్రులైన దొరలను పాలెములందు గొలువు నిలిపి యెట్టివారి కభేద్య మగునట్లు గావించుట ప్రథమకర్తవ్యము. వీని నన్నిఁటిని జక్కపఱచుకొని యసంఖ్యాకంబు లగుబలంబులతోడ దండయాత్రలకు వెడలినచో నవలీల విజయమును బడయవచ్చును. కావున దేవర