పుట:Telugu merugulu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3

ఆంధ్ర కల్పవృక్షము

నాచిన్ననాఁటిమాట. మాగ్రామమున ఒకసంపన్న గృహస్థుఁడు తన గొప్పతాటితోఁటను నఱికించి, ఆ తోఁట భూమికి కృష్యనుకూలత కల్పించినాఁడు. ఏమికర్మమో కాని కొలదీ కాలమునకే యాతని యింట నమంగళము లనేకములు కలిగినది. ఊరి పెద్ద లందఱు "తాటిచె ట్టనఁగా భూలోకకల్పవృక్షము. అట్టి తాటిచెట్లను ఎన్నింటినో, ఎన్ని తరాలనాడు నాటినవానినో నఱికించినాఁడు; చెడినాఁడు” అన్నారు. నేను పదేండ్ల బాలుఁడను. మానాయనగారిని "ఇంకను కొబ్బరిచెట్టునో, మామిడి చెట్టునో అంటే అనవచ్చునేమో కానీ తాటిచెట్టును 'భూలోక కల్పవృక్ష' మనుట యేమిటి" అని అడిగినాను. ఆనాఁడు వారు చెప్పిన విషయమునే ప్రధానపఱుచుకొని, యిటీవల దానికి ప్రోద్బలకముగా నాకు గోచరించిన విషయములనుకూడ చేర్చుకొని యీ వ్యాసము రచించుచున్నాను.

పూర్వము ఆంధ్ర దేశమున ప్రతిగ్రామమునను తాటితోఁపులు ధర్మార్థము తప్పకుండ నాటు సంప్రదాయ ముండెడిది. ఊరిపెద్దలు ఎనుబది తొంబది యేండ్ల ముసలిప్రాయము కలవానిని వెదకి పట్టుకొని వానిచే తాటిగింజలు నాటించువారు. ఆ నాటినవాఁడు నాటినతాడి కాపుపట్టులోఁగా తప్పక చనిపోవు నని ప్రతీతి. నాటిన తాటిచెట్టు ఇర్వదైదేండ్లకుఁగాని కాపుపట్టదు. నాటినవాఁ డంతదాఁక జీవింప వీలులేనివాఁడు గావుట కంత ముసలివానిని వెదకువారు. “ముత్తాడి" అనఁగా మూఁడుతాటి చెట్లతరములు చూచినవాఁడు. దీర్ఘాయుష్మంతుఁడు. తనయెఱుకలో నాటిన తాటిమొలక పెరిగి,